కర్నూలు, ఆగస్టు 06: గతేడాది కర్నూలు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కీలక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి.. తీసుకున్న చర్యలను వివరిస్తూ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR)ను నాలుగు వారాల్లో తమకు నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ.. కర్నూలు జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాదాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని.. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బాధితులకు కల్పించిన రక్షణ చర్యలు, అధికార యంత్రాంగం స్పందినతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర విచారణ జరపాలని అందులో పిటిషనర్ కోరారు. దీనిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. అలాగే ఈ కేసు దర్యాప్తులో పురోగతి, బాధితుల కుటుంబాలకు అందించిన సహాయం, ఈ ఘటనకు బాధ్యులపై తీసుకున్న చర్యలు, బాధితులకు అందిన సాయంతో పాటు ప్రజా రవాణా భద్రత కోసం అమలు చేస్తున్న వివరాలను కూడా ఆ నివేదికలో పొందుపర్చాలని కర్నూలు జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది.
గతేడాది అక్టోబర్ 24వ తేదీన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం మత్తులో మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు.. యువతి పరిస్థితి విషమం

