Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కువైత్‌లో ఏపీఎన్నార్టీ ఆధ్వర్యంలో 'సర్' అవగాహన సదస్సు

కువైత్‌లో ఏపీఎన్నార్టీ ఆధ్వర్యంలో 'సర్' అవగాహన సదస్సు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఇంటా బయటా భారతీయ సమాజాన్ని అయోమయానికి గురి చేస్తున్న 'ప్రత్యేక సమగ్ర సవరణ'పై సరైన సమాచారం లేక గల్ఫ్ దేశాలలోని అనేక మంది ప్రవాసీయులు ఆందోళనకు గురవుతున్నారు.

గల్ఫ్‌లో ప్రత్యేకించి కువైత్‌లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న రాయలసీమ జిల్లా ప్రవాసీయులు తమ తల్లిదండ్రులు పేర్లు 2002 ఓటర్ల జాబితాలో లేకపోవడంపై కలత చెందుతూ మార్గదర్శక సూత్రాల కోసం ఎదురు చూస్తున్నారు.

2002 ఓటర్ల జాబితాలో తమ కుటుంబ సభ్యుల వివరాలను గుర్తించలేక 'నో మ్యాపింగ్‌' కింద దరఖాస్తులు సమర్పించిన వారికి కూడా ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఇప్పుడు పాత ఓటర్ల జాబితాలోని వివరాలను గుర్తించి మ్యాపింగ్‌ పూర్తి చేస్తే, వాటిని పోర్టల్‌లో నవీకరించే అవకాశం ఉంది. దీంతో సర్‌ ప్రక్రియలో మిగిలిన లోపాలను సరిదిద్దుతూ కచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ విదేశాలలోని తమ పార్టీ కార్యకర్తలకు కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ఈ దిశగా ఇటీవల కువైత్‌లో సర్ 2026 ఓటర్ల జాబితా సవరణ అవగాహన సదస్సును తెలుగు దేశం పార్టీ, ఏపీ ఎన్నార్టీ సంయుక్తంగా నిర్వహించగా అనూహ్యమైన స్పందన లభించింది. 2002లో చివరిసారి సవరణ జరిగినప్పుడు తమ తల్లిదండ్రులు కూడా కువైత్‌లో పని చేస్తూ ఉన్నారని వారి పేర్లు అందులో లేవని, ఇప్పుడు తమ పేర్లు చేర్చడం ఏలా అంటూ వచ్చిన అనేక మంది సందేహాలను ఏపీఎన్నార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు ఓలేటి దివాకర్ నాయుడు, ముష్తాఖ్ ఖాన్, ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాచూరి మోహన్‌లు తమ సమాధానాలతో నివృత్తి చేస్తూ విధి విధానాలను వివరించారు.

ఓటు హక్కు పరిరక్షించుకోవడంలో ప్రవాసాంధ్రులకు సరైన దశదిశ నిర్దేశం చేస్తున్న ప్రవాసాంధ్ర అధికార ప్రముఖులు వేమూరి రవి, రావి రాధాకృష్ణా, అక్కిలి నాగేంద్రబాబుల ప్రయత్నాలను నిర్వాహకులు అభినందించారు. సర్ గడువు ముగిసే వరకూ నిత్యం తాము కువైత్‌లో ప్రవాసాంధ్రులకు అందుబాటులో అవసరమైన సహాయసహాకారాలు అందిస్తామని ఈ సందర్భంగా దివాకర్ నాయుడు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ములకల సుబ్బారాయుడు, దరూర్ బలరాం నాయుడు, గున్నం శ్రీనివాసులు, ఎన్నారై తెలుగు దేశం పార్టీ గ్లోబల్ కమిటీ కార్యనిర్వహక కార్యదర్శి రాచూరి మోహన్, APNRT కువైత్, కోఆర్డినేటర్లు సత్య సాయిబాబా, దొడ్డిపల్లి సుబ్బారాజు, ఈశ్వర్ చాపలమడుగు, మహబూబ్ బాష, రాజశేఖర్ యాదవ్, ప్రసాద్, మహేందర్‌నాథ్, హరీష్, ములకల రవి, వంశీ కపెర్ల, సికందర్, నాగేశ్ నాయుడు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

సెయింట్‌ లూయిస్‌లో వైభవంగా ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం

ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy