Dailyhunt
మీ ముఖం బంగారంలా మెరిసిపోవాలా? శనగపిండిని ఇలా వాడండి

మీ ముఖం బంగారంలా మెరిసిపోవాలా? శనగపిండిని ఇలా వాడండి

ఇంటర్నెట్ డెస్క్: మీ చర్మం పొడిగా, నిస్తేజంగా కనిపిస్తుంటే శనగపిండితో తయారు చేసే కొన్ని ఫేస్ ప్యాక్‌లు మంచి ఫలితాలు ఇస్తాయని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు.

తేనె, బాదం నూనె, గుడ్డులోని తెల్లసొన వంటి పదార్థాలతో కలిపి ఉపయోగిస్తే చర్మానికి మంచి పోషణ లభిస్తుంది. పాతకాలంలో సబ్బులు ఎక్కువగా ఉపయోగించని సమయంలో చాలా మంది స్నానానికి కూడా శనగపిండినే వాడేవారు. ముఖం ప్రకాశవంతంగా ఉండేందుకు ఇది సహజమైన మార్గంగా మన పెద్దలు చెప్పేవారు. అయితే, కేవలం శనగపిండిని మాత్రమే వాడటం కంటే ఇంట్లో సులభంగా దొరికే కొన్ని పదార్థాలతో కలిపి ఉపయోగిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. పార్లర్‌కి వెళ్లి ఎక్కువ ఖర్చు చేయకుండా ఇంట్లోనే మీ ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.

శనగపిండి, నిమ్మరసం

2 టీస్పూన్లు శనగపిండి, కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక టీస్పూన్ మిల్క్ క్రీమ్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మానికి తేమను అందించి మృదువుగా మారుస్తుంది. నిమ్మరసం చర్మంపై ఉన్న నల్లదనాన్ని తగ్గించి మెరుపును ఇస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఇది మంచిగా పనిచేస్తుంది.

శనగపిండి, బొప్పాయి, నారింజ రసం

సూర్యరశ్మి వల్ల వచ్చే సన్‌టాన్‌, నల్లటి మచ్చలను తగ్గించడానికి ఈ ఫేస్‌ప్యాక్ ఉపయోగపడుతుంది. బాగా పండిన బొప్పాయి, శనగపిండి, కొద్దిగా నారింజ రసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. బొప్పాయిలోని పోషకాలు చర్మంలోని మృతకణాలను తొలగిస్తాయి. నారింజ రసంలో ఉన్న విటమిన్ C చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. వారానికి రెండుసార్లు వాడితే ముఖం సమానంగా కనిపిస్తుంది.

శనగపిండి, పసుపు, పెరుగు లేదా పాలు

ప్రత్యేక సందర్భాల్లో ముఖం మెరిసిపోవాలనుకునేవారు ఈ ఫేస్ ప్యాక్ వాడొచ్చు. శనగపిండి, చిటికెడు పసుపు, కొద్దిగా పెరుగు లేదా పాలు, తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఇది ముఖంలోని మురికిని లోతుగా తొలగించి చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అలాగే అవాంఛిత వెంట్రుకలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

శనగపిండి, తేనె, బాదం నూనె, గుడ్డులోని తెల్లసొన

చర్మం చాలా పొడిగా, నీరసంగా ఉంటే ఈ ఫేస్‌ప్యాక్ ఉపయోగపడుతుంది. శనగపిండిలో తేనె, బాదం నూనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి రాయాలి. గుడ్డులోని తెల్లసొన చర్మాన్ని కట్టుదిట్టంగా ఉంచి ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనె, బాదం నూనె చర్మానికి మంచి పోషణ ఇస్తాయి.

శనగపిండి, పాలు

సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ సులభమైన పద్ధతి ఉపయోగించవచ్చు. శనగపిండిని మరిగించని పాలతో కలిపి ముఖం, మెడకు రాయాలి. ఇది ముఖంపై ఉన్న అదనపు నూనె, మురికిని తొలగించి చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది.

శనగపిండి, నారింజ తొక్క పొడి, వెన్న

ముఖాన్ని సహజంగా స్క్రబ్ చేయడానికి ఇది మంచి పద్ధతి. నారింజ తొక్కను ఎండబెట్టి పొడి చేసి, దానిలో శనగపిండి, కొద్దిగా వెన్న కలపాలి. దీన్ని ముఖానికి రాసి మెల్లగా రుద్ది 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మ రంధ్రాల్లో దాగి ఉన్న మురికిని తొలగించి ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. చర్మ సమస్యలు ఉంటే లేదా ఏదైనా పద్ధతి ఉపయోగించే ముందు చర్మ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి

కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?

For More Latest News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy