Dailyhunt
మీరు రావద్దు, ప్రధాని పదవి పోతుందన్నారు.. నొయిడా సెంటిమెంట్‌పై మోదీ

మీరు రావద్దు, ప్రధాని పదవి పోతుందన్నారు.. నొయిడా సెంటిమెంట్‌పై మోదీ

నొయిడా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారంనాడు ప్రారంభించారు. గత పాలకులు మూఢనమ్మకాలతో నొయిడా అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు.

నొయిడాలో పర్యటిస్తే అది నాయకుల కెరీర్‌కు అపశకునంగా మారుతుందనే ప్రచారం చాలా కాలంగా ఉందని, అయితే తాను మాత్రం దీనిని పట్టించుకోలేదని చెప్పారు.

'మూఢనమ్మకాల కారణంగానే నొయిడాను నాయకులు పట్టించుకోలేదు. గత పాలకులు ఇక్కడకు వస్తే పదవి కోల్పోతామని భయపడుతుండేవారు. అందుకే నొయిడాకు రావడం మానేశారు' అని మోదీ చెప్పారు. తనకు వ్యక్తిగతంగా ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు.

'నాకు గుర్తుంది. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నొయిడాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాను. దీంతో సీఎం ఆందోళన చెందారు. కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండటమే కాకుండా నన్ను కూడా రావద్దని చెప్పారు. మోదీజీ... నొయిడా వెళ్లకండి.. ఇప్పుడే మీరు ప్రధానమంత్రి అయ్యారని సూచించారు. అయితే నేను నొయిడా ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తానని, అదే తనకు దీర్ఘకాలం దేశానికి సేవ చేసే అవకాశం ఇస్తుందని ఆయనతో చెప్పాను' అని మోదీ తెలిపారు. ఒకప్పుడు నాయకులు వదిలేసిన ఈ ప్రాంతమే ఇప్పుడు ప్రపంచ నాయకులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందని, స్వయం సమృద్ధి, నిర్భర భారత్‌కు గర్వకారణంగా నిలిచిందని ప్రధాని ప్రశంసించారు.

నొయిడా శాపం...?

అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నొయిడా వెళ్లి వస్తే పదవి కోల్పోతారని మూఢనమ్మకం ఒకటి మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1988లో ముఖ్యమంత్రి వీర బహదూర్ సింగ్ నొయిడా వెళ్లి తిరిగి వచ్చిన కొద్దిరోజులకే తన పదవిని కోల్పోయారు. నొయిడాకు వెళ్లివచ్చిన తర్వాత పదవి కోల్పోయిన వారిలో 1989లో ఎన్డీ తివారీ, 1995లో ములాయం సింగ్ యాదవ్, 1997లో మాయావతి, 1999లో కల్యాణ్ సింగ్ ఉన్నారు. యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజ్‌నాథ్ సింగ్ సైతం నొయిడా-ఢిల్లీని అనుసంధానించే డీఎన్‌డీ ఫ్లైవేను నొయిడా నుంచి కాకుండా ఢిల్లీ వైపు నుంచి ప్రారంభించారు. 2013లో ఆసియన్ డవలప్‌మెంట్ బ్యాంక్ సమ్మిట్ నొయిడాలో జరిగినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం సమ్మిట్‌కు గైర్హాజరయ్యారు. అయితే ఈ మూఢనమ్మకాలను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎట్టకేలకు బ్రేక్ చేశారు. 2017లో అధికారంలో వచ్చినప్పటి నుంచి నొయిడాకు డజనుకు పైగా పర్యటనలు జరిపారు. 2022లో వరుసగా రెండోసారి సీఎంగా గెలిచారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy