హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు.
ఈ మేరకు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. తన సతీమణి అన్నా కొణిదాల, పిల్లలు అకీరానందన్, ఆద్య, పోలినా అంజని, మార్క్ శంకర్‌లతో కలిసి ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికినట్లు పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ప్రధాని మోదీ తన నివాసానికి రావడం ఆయనలోని ఆప్యాయత, మానవతా దృక్పథానికి నిదర్శనమని పవన్ కల్యాణ్ తెలిపారు.
పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై మోదీ ప్రత్యేక శ్రద్ధ..
తన శస్త్రచికిత్స అనంతరం ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఆ సమయంలో ప్రధాని తనకు ధైర్యం చెప్పి మద్దతుగా నిలిచారని తెలిపారు. ఇప్పుడు తాను కోలుకుంటున్న సమయంలో స్వయంగా తన నివాసానికి రావడం ప్రధాని చూపిన అపారమైన శ్రద్ధకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని ప్రతి ఒక్కరినీ తమ కుటుంబ సభ్యుల్లా చూస్తారని.. ఆయన ఆలోచనలు, చేతల్లో ఎప్పుడూ ప్రజల సంక్షేమమే ప్రధానంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశానికి నాయకత్వం వహించే బాధ్యతల మధ్య కూడా తనతో వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగించడం ఆయన చూపిన ప్రత్యేకత అని కొనియాడారు.
మోదీ నాయకత్వం స్ఫూర్తిదాయకం..
ప్రధాని మోదీ నాయకత్వం, దేశ ప్రగతిపై అంకితభావం కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మోదీ వినయం, కరుణ, ప్రజలతో ఆయనకున్న భావోద్వేగ అనుబంధం భారతదేశవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తోందని తెలిపారు.
మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్..
మోదీ తనపై చూపిన ఆప్యాయత, శ్రద్ధ, మద్దతుకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శనం తనకు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆయన తమ కుటుంబంతో గడిపిన సమయం ఎంతో విలువైనదని, ఈ పర్యటన చిరస్మరణీయమని తెలిపారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున స్పందిస్తూ ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రశంసిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత పరామర్శకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రధాని మోదీపై పలువురు నేతలు కూడా అభినందనలు తెలుపుతున్నారు.
.
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News

