Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాస్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..

పాస్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..

ఇంటర్నెట్ డెస్క్: పాస్‌పోర్ట్‌ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా 15 ఏళ్లలోపు పిల్లల పాస్‌పోర్ట్‌ చెల్లుబాటు గడువును పరిమితం చేసింది.

అంటే మారిన నిబంధనల ప్రకారం.. 15 సంవత్సరాలలోపు పిల్లలకు జారీచేసే సాధారణ పాస్‌పోర్ట్‌ గడువు ఐదేళ్లు లేదా 18 ఏళ్లు నిండే వరకు(ఏది ముందైతే అది) చెల్లుబాటవుతుంది.

2012 తర్వాత తొలిసారిగా సాధారణ పాస్‌పోర్ట్‌ ఫీజులను సవరించింది ప్రభుత్వం. ఈ ఏడాది జులై 1 నుంచి పాస్‌పోర్ట్‌ దరఖాస్తు రుసుముల్లోనూ సవరణలు అమల్లోకి వచ్చాయి. 18 ఏళ్లు పైబడిన వారికి 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌ కొత్తగా తీసుకునేందుకు లేదా రెన్యువల్ చేసుకోవడానికి రూ.2,500 చెల్లించాలి. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.3,500 రుసుము ఖరారైంది. తత్కాల్‌ విధానంలో 36 పేజీలకు రూ.5,000, 60 పేజీలకు రూ.6,000గా రుసుమును నిర్ణయించారు.

ఇక.. 18 ఏళ్లలోపు పిల్లలకు 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌ కొత్తగా తీసుకోవడానికి లేదా రెన్యువల్ చేసుకునేందుకు రూ.1,750 చెల్లించాలి. తత్కాల్‌ విధానంలో ఇదే పాస్‌పోర్ట్‌కు ఈ మొత్తం రూ.4,250గా ఉంది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న మైనర్లు పూర్తి పదేళ్ల చెల్లుబాటుతో కూడిన పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకునే కేటగిరీలోకి వస్తే, పెద్దలకు వర్తించే రుసుములే వర్తించనున్నాయి. కాగా.. 8 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు కొత్త పాస్‌పోర్ట్‌ కోసం చేసే దరఖాస్తులపై 10 శాతం డిస్కౌంట్ యథాతథంగా కొనసాగనుంది. అయితే.. ఈ డిస్కౌంట్ రెన్యువల్ దరఖాస్తులకు వర్తించదు.

ఇతర రుసుముల్లోనూ మార్పులు

పాస్‌పోర్ట్‌ పోగొట్టుకున్నా లేదా డ్యామేజ్ అయినా మరలా కొత్త పాస్‌పోర్ట్‌ పొందేందుకు చెల్లించే రుసుములూ పెరిగాయి. 36 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.5,000; 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.6,000గా నిర్ణయించారు. పాస్‌పోర్ట్‌ ఆధారిత పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌(పీసీసీ), సరెండర్‌ సర్టిఫికెట్‌ తదితర సేవలకు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రుసుములు, నిబంధనలకు సంబంధించిన వివరాలను అఫీషియల్ పాస్‌పోర్ట్‌ వెబ్ పోర్టల్‌లో చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy