Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రత్యర్థి జట్లకు వైభవ్ భయాన్ని పరిచయం చేశాడు: సచిన్ టెండూల్కర్

ప్రత్యర్థి జట్లకు వైభవ్ భయాన్ని పరిచయం చేశాడు: సచిన్ టెండూల్కర్

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ముగిసి మూడు రోజులు అయింది. కానీ వైభవ్ సూర్యవంశీ ఆటతీరు గురించి ఇంకా చర్చించుకుంటున్నారు. ఈ సీజన్‌లో వైభవ్ సృష్టించిన విధ్వంసం అలాంటిది మరి!

15 ఏళ్ల వయసులోనే రికార్డులు కొల్లగొడుతూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. 16 మ్యాచుల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఒక లీగ్‌లో 750కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

'వైభవ్ ప్రభావం ప్రతి జట్టుపై పడింది. అతడు క్రీజులోకి రాకముందే ప్రత్యర్థి జట్లు అతడి గురించి ఆలోచించేవి. అతడిని ఎలా అడ్డుకోవాలని ప్రణాళికలు రచించేవి. ప్రత్యర్థి జట్లకు వైభవ్ భయాన్ని పరిచయం చేశాడు. అభిమానులు కూడా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కోసం ఎదురుచూసేవారు. ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచుల్లోనూ అతడు అదే దూకుడును కొనసాగించాడు. ముఖ్యంగా వైభవ్ క్రీజులోకి వస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టులో అదనపు ఆత్మవిశ్వాసం కనిపించేది' అని సచిన్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే, వైభవ్ సూర్యవంశీపై అధ్యయనం నిర్వహించనున్నట్లు ఐఐఎం ఇండోర్ ప్రకటించింది. చిన్న వయసులోనే అసాధారణ విజయాలు సాధించే ప్రతిభావంతులపై అంచనాల ఒత్తిళ్లు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ఐఐఎం పరిశోధన చేయనుంది. 'వైభవ్‌ లాంటి బాల మేధావులు అద్భుత ప్రదర్శనలు చేసేందుకు ప్రేరేపించే కారకాలు ఏంటి? వాళ్ల ప్రాక్టీస్‌ ఎలా ఉంటుంది? మనస్తత్వం ఏంటి? వాళ్లు గొప్పగా రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కోచ్‌లు, సీనియర్లు ఎలాంటి సహకారం ఇస్తున్నారు? ఒక దశకు వచ్చిన తర్వాత ఎదురయ్యే అడ్డంకులను ఎలా ఎదుర్కొంటున్నారు? తదితర అంశాలను పరిశోధించబోతున్నాం' అని ఐఐఎం డైరెక్టర్‌ హిమాంశు రాయ్‌ వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy