Dailyhunt
పూలే స్పూర్తికి భిన్నంగా కాంగ్రెస్ పాలన: బండి సంజయ్

పూలే స్పూర్తికి భిన్నంగా కాంగ్రెస్ పాలన: బండి సంజయ్

హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఘనంగా నివాళులర్పించారు.

అణచివేతపై తిరుగుబాటుకు కేరాఫ్ అడ్రస్.. బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యం... మహాత్మా జ్యోతి రావు పూలే అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ సమాజమైతే చదువు పరంగా, ఆర్థికంగా ఎదుగుతుందో అప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని ఆశించిడమే కాకుండా అందుకోసం చివరిదాకా కృషి చేసిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను అభిమానించే జ్యోతిరావు ఫూలే కుల వివక్షపై అలుపెరగని పోరాటం చేశారని కీర్తించారు. ఆ రోజుల్లోనే వితంతు పునర్వివాహాలు జరపడంతోపాటు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని ప్రశంసించారు. మహిళల చదువు కోసం నిరంతరం పాటుపడ్డారని తెలిపారు.

అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపారు..

దీనబంధు అనే పత్రికను స్థాపించి బీదల, కార్మికుల సమస్యలను సమాజానికి తెలిసేలా చేశారని బండి సంజయ్ కుమార్ ప్రస్తావించారు. అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి, పేదలను ఆదుకోవడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతుడు ఫూలే అని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ ఫూలేను గురువుగా ప్రకటించుకున్నారంటే ఆయన గొప్పదనం ఏంటో అర్థమవుతుందని అన్నారు. సతీమణి సావిత్రీబాయి ఫూలేతో కలిసి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించి ఏకంగా 52 పాఠశాలలను ప్రారంభించి వేలాది మంది పేదలకు అక్షర జ్ఝానాన్ని అందించిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు. స్వాతంత్య్రం రాని రోజుల్లోనే నిర్బంధాలను, అణిచివేతలను తట్టుకుంటూ అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు జ్యోతిరావు ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని కీర్తించారు.

ఫూలే ఆశయాలకు, స్పూర్తికి భిన్నంగా కాంగ్రెస్ పాలన..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జ్యోతిరావు ఫూలే ఆశయాలకు, స్పూర్తికి భిన్నంగా పాలన కొనసాగిస్తోందని బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ పనితీరు దారుణంగా ఉందని తెలిపారు. అక్షరాస్యతలో జాతీయ సగటు కంటే తెలంగాణ పూర్తిగా వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని చెప్పుకొచ్చారు. ఆరోగ్య శ్రీ బకాయిలు ఏళ్ల తరబడి చెల్లించకపోవడంతో కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ కార్డుపై చికిత్స చేయించుకోలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వ భూములను ఎడాపెడా అమ్ముతూ భవిష్యత్తు తరాలకు గజం జాగా కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఇకనైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫూలే ఆశయాలను మాటల్లో కాకుండా చేతల్లో చూపాలని బండి సంజయ్ కోరారు.

.

రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు

సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ

హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy