ఢిల్లీ, సెప్టెంబర్ 18: మొబైల్ ఫోన్ వినియోగదారులను వేధించే స్పామ్ కాల్స్, అనవసర సందేశాల నివారణకు భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
టెలికాం కంపెనీలు, థర్డ్ పార్టీ యాప్‌లు, వినియోగదారుల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ముఖ్యమైన నిబంధనలు.. మార్పులు
140, 1600 సిరీస్ నంబర్లకు స్పామ్ ట్యాగింగ్ మినహాయింపు: వాణిజ్య, అధికారిక సేవలకు ఉపయోగించే 140xx, 1600xx సిరీస్ నంబర్లను Truecaller వంటి యాప్‌లు 'స్పామ్' గా ఫ్లాగ్ చేయడానికి వీల్లేదు.
డేటా షేరింగ్ తప్పనిసరి: టెలికాం కంపెనీల సమాచారం ఆధారంగా స్పామ్‌ను గుర్తించే యాప్‌లు, ఆ డేటాను టెలికాం ఆపరేటర్లతో తప్పనిసరిగా పంచుకోవాల్సి ఉంటుంది.
ఫిర్యాదుల నిబంధన.. కటాఫ్ పరిమితి తగ్గింపు: ఒకే నంబర్‌పై స్పామ్ కాల్స్ వస్తున్నాయని గతంలో 5 ఫిర్యాదులు వస్తే గానీ చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని 3 ఫిర్యాదులకు తగ్గించారు. అంటే, 3 ఫిర్యాదులు వస్తే ఆ నంబర్‌ను నిలిపివేసే దిశగా చర్యలు చేపడతారు.
అప్పీల్ మెకానిజమ్: తమ ఫిర్యాదుపై టెలికాం ఆపరేటర్లు తీసుకున్న చర్యలపై అసంతృప్తిగా ఉన్న వినియోగదారులు సవాలు చేసేందుకు కొత్తగా అప్పీల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాల్స్‌పై నిబంధనలు: బల్క్ వ్యాపార ప్రకటనల కోసం AI టెక్నాలజీ ఉపయోగించే సంస్థలు ఆ విషయాన్ని ముందే టెలికాం కంపెనీలకు వెల్లడించాలి. వెల్లడించకపోతే నిమిషానికి 5 పైసల పెనాల్టీ విధిస్తారు.
రీ-వెరిఫికేషన్ (KYC): వాణిజ్య కాల్స్ కోసం ఉపయోగించే నంబర్ల గుర్తింపును పారదర్శకంగా ఉంచేందుకు టెలికాం కంపెనీలు వాటి KYC వివరాలను మళ్లీ తనిఖీ చేయాల్సి ఉంటుంది.
హై-ప్రొబబిలిటీ స్పామ్ నంబర్ల గుర్తింపు: స్పామ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్న నంబర్లను ముందే గుర్తించి, ఆ వివరాలను భాగస్వామ్య నెట్‌వర్క్‌తో పంచుకోవాలని ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది.

