Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

ఇంటర్నెట్ డెస్క్: యూఏఈలోని బరాక్కా అణువిద్యుత్ కేంద్రం టార్గెట్‌గా డ్రోన్ దాడి జరగడాన్ని భారత్ తాజాగా ఖండించింది. పరిస్థితి ప్రమాదకర మలుపు తిరుగుతోందని హెచ్చరించింది.

అణు కేంద్రాన్ని టార్గెట్ చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇది ఆందోళనకరమైన పరిణామమని పేర్కొంది. సంయమనం పాటించాలని, చర్చలు, దౌత్యమార్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం ఈ డ్రోన్ దాడి జరిగింది. ప్రధాన విద్యుత్ కేంద్రానికి సమీపంలోని ఎలక్ట్రిక్ జనరేటర్‌పై డ్రోన్ దాడి జరగడంతో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. రేడియేషన్ లీకేజీ లేదని కూడా చెప్పారు. విద్యుత్ ప్లాంట్‌లో కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయని అన్నారు. విద్యుత్ ప్లాంట్ భద్రతపై ఆందోళన అవసరం లేదని అన్నారు. ఇది అకారణంగా జరిగిన ఉగ్రదాడి అని కూడా పేర్కొన్నారు. అయితే, ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకూ ఏ సంస్థ కూడా ప్రకటన విడుదల చేయలేదు.

తమ దేశానికి పశ్చిమాన ఉన్న సరిహద్దు అవతలివైపు నుంచి మూడు డ్రోన్స్ వచ్చాయని యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. రెండు డ్రోన్స్‌ను మాత్రమే అడ్డుకోగలిగామని పేర్కొంది. డ్రోన్స్‌ను ప్రయోగించింది ఎవరో తెలుసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.

దక్షిణ కొరియా సాయంతో ఈ అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించారు. ఇది గల్ఫ్‌లో ఉన్న ఒకే ఒక అణువిద్యుత్ కేంద్రం. 2020 నుంచీ అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 20 బిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ విద్యుత్ కేంద్రం యూఏఈలో 25 శాతం విద్యుత్ అవసరాలను తీరుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy