Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. అభిమాని శశి భవ్యతకు రామ్‌ పోతినేని భరోసా

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. అభిమాని శశి భవ్యతకు రామ్‌ పోతినేని భరోసా

Chitrajyothy 4 days ago

రుదైన జన్యులోప వ్యాధితో బాధపడుతోన్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన 18 ఏళ్ల బాలిక శశి భవ్యత (Shashi Bhavyata) పట్ల సినీ నటుడు రామ్‌ పోతినేని (Ram Pothineni) మానవత్వం చాటారు.

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో, ఏబిఎన్ న్యూస్ ఛానల్‌లో ఆమె పరిస్థితి గురించి తెలియజేసిన వీడియోలు వైరల్ కావడంతో హీరో రామ్ స్పందించి.. స్వయంగా ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడి భరోసానిచ్చారు. ​తమ అభిమాన హీరోతో కూతురు మాట్లాడటంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి.

అసలు విషయం ఏమిటంటే.. హీరో రామ్ పోతినేని అంటే శశి భవ్యతకు చాలా ఇష్టం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే తప్ప ఆమె ముద్ద కూడా నోట్లోకి తీసుకోదు. ఒకప్పుడు ఎంతో చురుగ్గా ఉంటూ చదువుల్లో ముందున్న ఆ అమ్మాయి.. నేడు ఓ అరుదైన జన్యు వ్యాధి 'లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ'తో మంచానికే పరిమితమైంది. కనీసం మాట్లాడలేని, గుర్తు పట్టలేని స్థితిలోనూ.. తన అభిమాన హీరో పేరు వింటే మాత్రం ఆమె కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె అయిన శశి భవ్యత.. అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. చక్కటి ప్రతిభ కనబరుస్తూ కుటుంబానికి వెలుగుగా నిలుస్తుందనుకున్న ఆమె జీవితంలో 2022 నుంచి ఊహించని కష్టం మొదలైంది.

దాదాపు మూడు తరాలుగా కుటుంబంలో జరుగుతున్న మేనరికపు వివాహాల కారణంగా శశి భవ్యత అరుదైన జన్యుపరమైన సమస్య బారిన పడింది. 2022లో మొదలైన ఫిట్స్ సమస్య క్రమంగా తీవ్రరూపం దాల్చి, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో మతిస్థిమితం కోల్పోయి పూర్తిగా మంచానికే పరిమితమైంది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయినా, తన అభిమాన హీరో రామ్ పాటలు వింటూ ఆ బాధను తట్టుకునే ప్రయత్నం చేస్తూ వస్తోంది. తమ బిడ్డకు సరైన వైద్యం అందితే.. మళ్లీ మామూలు మనిషి అవుతుందన్న ఆశతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం, ప్రభుత్వం అందించే తోడ్పాటు కోసం ఎదురు చూస్తుండగా, శశి భవ్యత అనారోగ్యంపై, ఆమె ఇష్టంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ ప్రత్యేక కథనాన్ని టెలికాస్ట్ చేసింది. ఇది హీరో రామ్ వరకు చేరడంతో.. వెంటనే ఆయన వీడియో కాల్ చేసి, 'చెల్లీ.. గుర్తుపట్టావా? అంటూ శశి భవ్యతతోనూ అలాగే ఆమె పేరేంట్స్‌తోనూ మాట్లాడారు.

ఈ సందర్భంగా బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రామ్‌ పోతినేని, ఆమెకు అవసరమైన మందులు, తిండి, ఇతర ఖర్చులు పూర్తిగా తనే భరిస్తానని మాటిచ్చారు. అలాగే, నిపుణులైన వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని, బాలికను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని, సరైన సమయానికి మందులు వాడాలని తల్లిదండ్రులకు సూచించారు. శశి భవ్యత దీనస్థితిని వెలుగులోకి తెచ్చి తన దృష్టికి తీసుకువచ్చిన మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అభిమానులు, పాత్రికేయులకు రామ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రామ్‌ అందించిన భరోసా.. ఎంతో ధైర్యాన్నిచ్చిందని ఈ సందర్భంగా శశి భవ్యత తల్లిదండ్రులు తమ ఆనందాన్ని తెలియజేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

పెళ్ళైన మగాడితో అడ్డంగా దొరికిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్...

Balakrishna: 'రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి

ఓటీటీకి వచ్చేస్తోన్న కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చు అంటే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy