ACB Raids DSP Bhimreddy House : తెలంగాణలో అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే నమ్మదగిన సమాచారంతో డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నార్సింగిలోని ప్రసిద్ధ ‘వేసెల్లా మెడోస్’లో ఉన్న డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసంలో తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. భీమ్‌రెడ్డితో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, వ్యాపార భాగస్వాములకు సంబంధించిన ఇళ్లలోనూ ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల్లో భారీగా ఆస్తులు, ల్యాండ్ డాక్యుమెంట్లు, నగదు, బంగారాన్ని అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ACB Raids DSP Bhimreddy House
ACB Raids DSP Bhimreddy House : గతంలో కీలక కమిషనరేట్లలో విధి నిర్వహణ
భీమ్‌రెడ్డి గతంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అంతర్గతంగా విచారణ జరిపిన ఏసీబీ అధికారులు.. స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఈ రోజు దాడులకు వ్యూహం రచించారు. ప్రస్తుతం ఆయన డీజీపీ ఆఫీస్‌లోని కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువను ఏసీబీ అధికారులు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
Epaper: epaper.vaartha.com

