TGSRTC DA Hike 2026: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని ప్రకటించింది. ఈ ఏడాదిలో సంస్థ ఉద్యోగులకు జనవరిలో ఇవ్వాల్సిన డీఏను ( DA) అందజేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
శుక్రవారం సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వై. నాగిరెడ్డి , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమార 38 వేల మందికి పైగా ఆర్టీసీ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.
Read Also:Telangana High Court: మద్యం తాగితే వాహనం సీజ్ చేయకూడదు.. పోలీసులకు కీలక ఆదేశాలు!

పెరిగిన డీఏ లెక్కలివే…
ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 50.7 శాతం డీఏ అందుతుండగా, తాజాగా 2.1 శాతాన్ని పెంచారు. దీనితో మొత్తం డీఏ 52.8 శాతానికి చేరింది. ఈ పెంపు జనవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. గత మూడు నెలలకు (జనవరి, ఫిబ్రవరి, మార్చి) సంబంధించిన బకాయిలను ఏప్రిల్ నెల జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పెంపు వల్ల సంస్థపై ప్రతి నెలా రూ. 2.82 కోట్ల మేర ఆర్థిక భారం పడనుంది.
TGSRTC DA Hike 2026: ఆర్టీసీ సిబ్బందికి డీఏలన్నీ చెల్లింపులు
గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న డీఏలను ఈ ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తూ వస్తోంది. 2024 మే నెలలో RPS-2017 అమలు చేసిన తర్వాత, తాజాగా ఈ 2.1 శాతం డీఏను కూడా మంజూరు చేయడంతో, ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలన్నీ పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది జూలై 2025లో కూడా ప్రభుత్వం 2.1 శాతం డీఏను పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కార్మికుల సంక్షేమమే ధ్యేయం : మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజా పాలన ప్రభుత్వం మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డీఏ పెంపుతో పాటు అంతకుముందు పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాక త్రిసభ్య కమిటీ ద్వారా దీర్ఘకాలంగా విధులకు దూరమైన వారిని తిరిగి తీసుకోవడం, కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఆర్టీసీ ఆసుపత్రిని ఆధునీకరించడం జరిగిందన్నారు. సంస్థలో ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా నియామకాల చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
సంస్థ ఉద్యోగులకు డీఏను చెల్లించాలని మంత్రి ఆదేశించడం పట్ల టీజీఎస్‌ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై. నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ఈ డీఏ పెంపు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగలదని ఎండీ నాగిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈడీ లు శ్రీ. సిహెచ్.వెంకన్న, శ్రీ. ఖుస్రో షా ఖాన్,శ్రీ. రాజశేఖర్, శ్రీ.సాల్మన్, ఎఫ్ఏ శ్రీమతి విజయపుష్ప, సిటీఎం ఏం & సి శ్రీ .శ్రీధర్, సిపిఎం శ్రీమతి ఉషాదేవి, సీసీఈ శ్రీమతి కవిత తదితరులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

