Asha Bhosle: భారతీయ సంగీత ప్రపంచం ధ్రువతార ఆశా భోంస్లే మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా నివాళులర్పించారు.
భారతదేశం కన్న గొప్ప బహుముఖ ప్రజ్ఞావంతురాలైన గాయకులలో ఆశా భోంస్లే ఒకరని ఆయన కొనియాడారు.
Read Also:Asha Bhosle Health Update: ఆశా భోస్లే ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన మనవరాలు
భారతదేశం చూసిన అత్యంత ప్రసిద్ధ, బహుముఖ ప్రజ్ఞావంతురాలైన గాయకులలో ఆశా భోంస్లే ఒకరని మోదీ కొనియాడారు."భారతదేశం గర్వించదగ్గ బహుముఖ ప్రజ్ఞాశాలి, దిగ్గజ గాయకులలో ఒకరైన ఆశా భోంస్లే గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం మన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాలను ఆమె తన గానంతో స్పృశించారు. ఆర్ద్రతతో కూడిన మెలోడీలు అయినా, ఉత్సాహభరితమైన గీతాలైనా, ఆమె గొంతులో కాలాతీతమైన ప్రతిభ దాగి ఉంది.
Asha Bhosle: ఆమెతో ఉన్న పరిచయం ఎప్పటికీ గుర్తుంటుంది
ఆమెతో నాకున్న పరిచయాన్ని, సంభాషణలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఆమె పాటలు ప్రజల జీవితాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి" అంటూ ప్రధాని తన ట్వీట్ లో కీర్తించారు.
చంద్రబాబు తీవ్ర సంతాపం
ఆశా భోంస్లే మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు."ప్రముఖ గాయని ఆశా భోంస్లే జీ ఇక లేరన్న వార్త విని నేను తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురయ్యాను. భారత సంగీత ప్రపంచంలో ఆమె ఒక దిగ్గజం. ఆమె లాంటి విలక్షణమైన, వైవిధ్యమైన గాయని మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన కళాకారిణిగా చరిత్రలో నిలిచిపోయిన ఆమె కీర్తి అజరామరం.
ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం అసాధారణమైనది. ఆమె పాడిన పాటలు ఎన్నో తరాలను ఉర్రూతలూగించాయి, మనందరి జీవితాల్లో భాగమైపోయాయి. ఆమె గాత్రంలోని మాధుర్యం, భావం మరపురానివి. పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారం ఆమె ప్రతిభకు ఒక చిన్న గుర్తింపు మాత్రమే.భారతదేశ సంగీత వారసత్వంలో ఆమె స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది.
ఆమె పాటల రూపంలో మన మధ్యే చిరస్థాయిగా జీవించి ఉంటారు. ఈ విషాద సమయంలో, ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులకు నా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
ఆశా భోంస్లే మృతి పట్ల కేటీఆర్ సంతాపం
ఆశా భోంస్లే మృతి పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. భారతీయ సంగీత ప్రపంచం ఒక అపురూపమైన స్వరాన్ని కోల్పోయిందని అన్నారు. సుమారు 8 దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన పద్మవిభూషణ్ ఆశా భోంస్లే మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.ఆశా భోంస్లే కేవలం ఒక గాయని మాత్రమే కాదని..
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక శకమని కేటీఆర్ కొనియాడారు. వేల సంఖ్యలో ఆమె పాడిన పాటలు తరతరాలకీ సంగీత పాఠాలుగా నిలిచిపోతాయని అభిప్రాయపడ్డారు. తెలుగులో కూడా ఆమె పాడిన మధుర గీతాలు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయని అన్నారు. ఆమె మరణం భారతీయ కళా జగత్తుకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు.ఆశా భోంస్లే ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ కోరారు. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చిరంజీవి 'ఎక్స్' వేదికగా ఆశా భోంస్లేకు భావోద్వేగ నివాళి
మెగాస్టార్ చిరంజీవి 'ఎక్స్' వేదికగా ఆశా భోంస్లేకు భావోద్వేగ నివాళి అర్పించారు. "ఆశా భోంస్లే గారి గొంతు భారతీయ సినిమాకు తరతరాలుగా నిలిచిపోయే ఓ అపురూపమైన తోడు. ఎన్నో భావోద్వేగాలను పలికించింది. ప్రతి పాటలోనూ ఆమె చూపిన అప్రయత్నమైన శైలి, వైవిధ్యం నన్ను ఎప్పుడూ ఆకట్టుకునేవి. భారతీయ సినిమా భర్తీ చేయలేని గొంతుకలలో ఒకదాన్ని కోల్పోయింది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి" అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
కమల్ హాసన్ కూడా 'ఎక్స్'లో ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేసి హిందీలో నివాళి
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా 'ఎక్స్'లో ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేసి హిందీలో నివాళి అర్పించారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, "ఆశా జీ, మిమ్మల్ని కోల్పోవడం నాకు వ్యక్తిగతంగా అనిపిస్తోంది. ఎందుకంటే మీ గొంతు నా చిత్రాలను ఆశీర్వదించింది" అని ఇన్స్టాగ్రామ్‌లో రాశారు. మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి స్పందిస్తూ, "హద్దులు దాటిన గొంతుక ఆమెది. ఆమె లేని లోటు భారతీయ సినిమాకు, సంగీత ప్రపంచానికి తీరనిది" అని పేర్కొన్నారు.
ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: జూనియర్ ఎన్టీఆర్
ఈ వార్త తెలిసిన వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, "ఆశా భోస్లే గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. దశాబ్దాలుగా భారత సినిమాకు ఆమె మాయా గాత్రం గుండెచప్పుడులా నిలిచింది. ఆమె వారసత్వం తరతరాలకు నిలిచిపోతుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి," అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇది పూడ్చలేని లోటు: మోహన్ బాబు
సీనియర్ నటుడు మోహన్ బాబు స్పందిస్తూ, "ఆశా భోస్లే గారితో ఒక శకం నిశ్శబ్దంగా ముగిసింది. ఆమె గొంతు కేవలం సంగీతం కాదు, మన జీవితంలోని ప్రతి దశలో మనతో ఉన్న భావోద్వేగం. తరతరాల హృదయాలను ఆమెలా స్పృశించిన కళాకారులు అరుదు. ఆమె గాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది," అని పేర్కొన్నారు. నటుడు విష్ణు మంచు కూడా, "మనం ఆశా భోస్లే గారి పాటలను కేవలం వినలేదు.. వాటితో జీవించాం. ఇది పూడ్చలేని లోటు," అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశా గారు మమ్మల్ని ఎంతో ప్రేమగా పలకరించేవారు: నటుడు విక్రమ్ ప్రభు
తమిళ నటుడు విక్రమ్ ప్రభు తన కుటుంబంతో ఆశా భోస్లేకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. "ఆశా గారు మమ్మల్ని ఎంతో ప్రేమగా పలకరించేవారు. ఆమె మా కుటుంబ సభ్యురాలు. చెన్నై వచ్చినప్పుడల్లా మా తాత శివాజీ గణేశన్ ఇంట్లోనే ఉండేవారు" అని తెలిపారు. ఆస్కార్ విజేత సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి కూడా ఆమెకు నివాళులు అర్పించారు.
ఆశా భోంస్లే మృతి పట్ల ఏపీ మంత్రి, నారా లోకేశ్ తీవ్ర విచారం
ఆశా భోంస్లే మృతి పట్ల ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె భౌతికంగా లేకపోయినా, ఆమె పాటలు జీవించే ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

