అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన 'జలధార' బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా సమీక్షా సమావేశాలకే పరిమితమయ్యే అధికారుల పనితీరును, ఈసారి ఏకంగా ప్రజల ముందే ఎండగట్టారు.
తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి వివిధ శాఖల ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ ను చదివి వినిపించిన సీఎం, ఆశించిన స్థాయిలో పని చేయని అధికారులను వేదికపైకి పిలిపించి బహిరంగంగానే వివరణ కోరారు. వ్యవస్థలను గాడిలో పెట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేస్తూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిని సహించేది లేదని హెచ్చరించారు. అదే సమయంలో సమర్థవంతంగా పనిచేసిన అధికారులను ప్రజల చేత చప్పట్లు కొట్టించి అభినందించడం ద్వారా అటు హెచ్చరికను, ఇటు ప్రోత్సాహాన్ని సమతూకంలో ప్రదర్శించారు.
Read Also : CM Revanth: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ముహూర్తం ఫిక్స్

ఉద్యోగుల వర్గీకరణ.. పనితీరు ఆధారంగానే గుర్తింపు
ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచేందుకు ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా నాలుగు విభాగాలుగా వర్గీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సూపర్ అచీవర్స్, అచీవర్స్, పెర్ఫార్మర్స్, మరియు లెర్నర్స్గా ఈ వర్గీకరణ ఉంటుందని వెల్లడించారు. ఇకపై తాను నిర్వహించే ప్రతి సభకు జిల్లా యంత్రాంగం మొత్తం హాజరుకావాలని, ప్రజల సమస్యలపై అక్కడికక్కడే స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సంతృప్తే ప్రామాణికంగా పాలన సాగాలని, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు భూవివాదాలు లేకుండా చూడటంలో చురుకైన పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన వ్యవస్థలను పునర్నిర్మించే ప్రక్రియలో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు
రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి నేరుగా ప్రజల అభిప్రాయాలను కోరారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ, సామాన్యులకు భారం తగ్గాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పునరుద్ఘాటించారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించే వారిని ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా అధికారులపై అనవసరంగా ఫిర్యాదులు చేయకుండా, వారి పనితీరును బట్టి సహకరించాలని సూచించారు. రాజకీయ పార్టీలైనా, ప్రభుత్వ అధికారులైనా వారి పనితీరును బట్టే ప్రజలు విశ్లేషించుకోవాలని, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా అందరూ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి సహకరించే నీతిమంతమైన అధికారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన తెలంగాణ ఆర్టీసీ MD

