Pawan Kalyan Tweet: గత రెండు రోజులుగా తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
మంగళవారం ఆయన అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పటి నుంచి తమిళ పొలిటికల్ సర్కిల్స్‌లో అనేక ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఒక ట్వీట్ ఈ అనుమానాలను మరింత బలపరిచింది.
Pawan Kalyan wishes Annamalai a happy birthday
Pawan Kalyan Tweet: ఢిల్లీ పర్యటన.. రాజీనామా లేఖ సమర్పణ?
ఢిల్లీ పర్యటనలో భాగంగా అన్నామలై బీజేపీ జాతీయ నేతలు నితిన్ నబీన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్‌లను విడివిడిగా కలిశారు. ఈ క్రమంలోనే అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన ఇప్పటికే నితిన్ నబీన్‌కు తన రాజీనామా లేఖను కూడా సమర్పించారని, అయితే బీజేపీ అధిష్టానం దాన్ని ఇంకా ఆమోదించలేదని ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్ ట్వీట్‌లో ఆ ‘ట్విస్ట్’ ఏంటి?
అన్నామలై పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. సోదరుడు అన్నామలైకు పుట్టినరోజు శుభాకాంక్షలు. వివిధ అంశాలపై మీకున్న స్పష్టత, మీ దృఢ సంకల్పం, ప్రజా సేవ పట్ల మీకున్న అచంచలమైన నిబద్ధత ఎంతోమంది నుంచి ప్రశంసలు వచ్చేలా చేశాయి. మురుగన్ స్వామి మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని పవన్ పేర్కొన్నారు.
అయితే ఈ ట్వీట్ చివర్లో పవన్.. భవిష్యత్తులో మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ.. అంతే ఉత్సాహం, నిజాయితీ, నిబద్ధతతో సేవ చేస్తూనే ఉంటారని ఆశిస్తున్నా అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ఏ మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ' అని పవన్ అనడంతో, అన్నామలై బీజేపీ నుంచి బయటకు రావడం ఖాయమని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
రజనీకాంత్‌తో జతకడతారా?
పవన్ కల్యాణ్ ట్వీట్ తెచ్చిన ఊపుతో తమిళనాడులో అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. ఒకట్రెండు రోజుల్లోనే బీజేపీకి రాజీనామా, తన భవిష్యత్తు కార్యాచరణపై అన్నామలై స్వయంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి రాజకీయ ప్రయాణం చేయబోతున్నారనే సరికొత్త సమీకరణం కూడా తెరపైకి వచ్చింది. ఈ ఊహాగానాలు అన్నింటికీ తెరపడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
యూకే ఉద్యోగాల పేరిట కోట్లలో మోసం..ఆరోపణలను తిరస్కరించిన యూట్యూబర్ నందు

