Dailyhunt
అవినీతి చట్టబద్ధత కోసమే అసెంబ్లీ తీర్మానం

అవినీతి చట్టబద్ధత కోసమే అసెంబ్లీ తీర్మానం

వార్త 2 weeks ago

Anantha Venkatarami Reddy: అమరావతి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్న అవినీతిని చట్టబద్ధత చేసుకోవడం కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు.

ఆదివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో చేస్తున్న దోపిడీనే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..!

Read Also: TDP Formation Day: అనంతపురం నగరంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అసెంబ్లీలో అమరావతి రాజధానికి చట్టబద్ధత పేరుతో కూటమి నాయకులు హైడ్రామా నడిపారు.రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ఐదేళ్ల పాటు అమరావతిలో అభివృద్ధికి ఖర్చు చేసింది కేవలం రూ.5 వేల కోట్లు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలం గడిపారు.2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిలో అభివృద్ధి అంటూ రూ.48 వేల కోట్లు అప్పుచేశారు. గతంలోనే రాజధాని కోసం 50 వేల ఎకరాలు సేకరించారు. ఇప్పుడు మళ్లీ 30 వేల ఎకరాలు సేకరిస్తున్నారు.వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడమే కోసమే అసెంబ్లీ సమావేశం పెట్టారు. మరోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న భయం వాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

Anantha Venkatarami Reddy: అవినీతిని చట్టబద్ధం

రాష్ట్ర విభజన అనేది అన్యాయంగా జరిగింది. ఏపీలో కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలున్నాయి. విభజన చట్టంలో మనకు హక్కుగా రావాల్సిన వాటిపై అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదు?2014లో బీజేపీ, జనసేన మద్దతుతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మూడున్నరేళ్లు గడిచాక మళ్లీ విడిపోయారు.రాజధాని అమరావతిపై గతంలో పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఏంటో అందరికీ తెలుసు. అమరావతి ఒక వర్గానికి పరిమితం అవుతోందని చెప్పలేదా?గతంలో పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. ఈ రోజు అమరావతిలోనూ అదే జరుగుతోంది. అవినీతిని చట్టబద్ధం చేసుకుంటున్నారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌

మొదట ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అయ్యింది. గత అనుభవాల దృష్ట్యా మరోసారి ప్రాంతీయ విభేదాలు రాకూడదన్న ఆలోచనతో అమరావతిని శాసన రాజధాని, విశాఖను పరిపాలన రాజధాని, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి సమగ్ర అభివృద్ధి చేయాలని వైఎస్‌ జగన్‌ భావించారు.ఈ రోజు అమరావతి రాజధాని కోసమే కాదు.. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి.రైల్వే జోన్‌ కోసం..విశాఖ ఉక్కు కోసం..ప్రత్యేక హోదా కోసం..పోలవరం కోసం..రాయలసీమ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కోసం తీర్మానం చేయాలి. వీటి గురించి పట్టించుకోకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఏంటి?

విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిది కాదా?

పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు 45.72 మీటర్లు ఉండాల్సి ఉంటే దాన్ని 41.15 మీటర్లకు కుదిస్తున్నారు. ప్రాజెక్ట్‌ను కుదిస్తే 190 టీఎంసీల నిల్వ సామర్థ్యం సాధ్యమవుతుందా?రాష్ట్రమంటే అమరావతి ఒక్కటే కాదు. ఇప్పటికే రూ.50 వేల కోట్లు అప్పు చేశారు. మళ్లీ రూ.50 వేల కోట్లు అప్పు చేసి ప్రజలపై భారం మోపడం ఏంటి?అత్యంత వెనుకబడిన రాయలసీమ గురించి ఆలోచించరా? గతంలో కర్నూలుకు వచ్చిన లా యూనివర్సిటీని తరలించేశారు. హైకోర్టు అమరావతికి పంపారు. ఎయిమ్స్‌ వస్తే మంగళగిరికి తీసుకెళ్లారు.రాజధాని 'అమరావతి వద్దే' అంటూ అసెంబ్లీలో తీర్మానం వెనుక అవినీతి దాగుంది. రాజధాని ప్రకటనకు ముందే అప్పటి మంత్రులు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడ భూములు కొన్నారు. ఇప్పుడు రేట్లు పెంచుకోవడం కోసం 'అమరావతి వద్దే' అంటూ చట్టబద్ధం చేసుకుంటున్నారు.

ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికా?

గెలుపు, ఓటములు అనేవి సహజం. 2019లో మీరు 23 సీట్లకే పరిమితం అయ్యారు. మళ్లీ అధికారంలోకి రాలేదా? గెలుపు ఎవరిది అనేది మీరు కాదు, ప్రజలు నిర్ణయిస్తారు.మళ్లీ జగన్‌ వస్తాడన్న భయంలో కూటమి నేతల్లో ఉంది. అందుకే 'వైకుంఠపాళి' అడొద్దంటూ మాట్లాడుతున్నారు.రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. కర్నూలులో హైకోర్టు, లా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. హంద్రీనీవాను విస్తరించాలి.ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏపీపైనే ఆధారపడి నడుస్తోంది. ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడానికి కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలి. ఈ మేరకు తీర్మానం చేసి పంపండి.రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో వైఎస్‌ జగన్‌ కనిపించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అపద్ధాలు చెప్పారు. విభజనకు వ్యతిరేకంగా 'స్టాప్‌ డివిజన్‌ ఆఫ్‌ ఏపీ' అంటూ వైఎస్‌ జగన్‌ నిరసన తెలియజేశారు. ఆరోజు నేను ఎంపీగా ఉన్నా.

ఇకనైనా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్, కూటమి నాయకుడు చౌకబారు విమర్శలు మానుకోండి.

మీడియా సమావేశంలో వైయస్సార్‌ సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ గౌడ్, క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జానీ, వైయస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగన్న, సాంస్కృతిక విభాగం నగర అధ్యక్షులు కేశవరెడ్డి, మైనార్టీ నాయకులు ముక్తియార్‌ పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సీనియర్ కార్యకర్త రాజప్ప యాదవ్‌ను పరామర్శించిన మంత్రి సవిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha