Prashant Kishor On NDA : బిహార్‌లోని బాంకీపుర్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (PK) బీజేపీ, ఎన్‌డీఏ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ ఎన్నికల విజయం కేవలం ఒక నియోజకవర్గ ఫలితం మాత్రమే కాదని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నాయకత్వంపై ప్రజలు ఇచ్చిన స్పష్టమైన సందేశమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ వ్యవహారశైలి, నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారని ఆరోపించారు. బాంకీపుర్ నియోజకవర్గం దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిందని ప్రశాంత్ కిశోర్ గుర్తుచేశారు. గత ఏడాది నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 51 వేలకు పైగా మెజారిటీ వచ్చిందని, అయితే ఏడాది కాలంలో అక్కడ ఎలాంటి కొత్త స్థానిక సమస్యలు రాకపోయినా ప్రజలు బీజేపీని ఓడించారని వివరించారు. ప్రజలు నిరాకరించింది బీజేపీ సిద్ధాంతాన్ని కాదని, ప్రస్తుతం రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న సీఎం సమ్రాట్ చౌధరీ ప్రవర్తన మరియు వారి ఇమేజ్‌ను మాత్రమే అని స్పష్టం చేశారు. నాయకత్వాన్ని మార్చాలని కేంద్ర బీజేపీకి ప్రజలు సంకేతం ఇచ్చారని అభిప్రాయపడ్డారు.
Read Also: Samudra Manthan : ఇంధన భద్రతకు 'సముద్ర మథనం'
Prashant Kishor
Prashant Kishor : హామీలు, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలి
బిహార్ రాజకీయాలు నేరాలు, ఎన్‌కౌంటర్లు, కుల సమీకరణాల చుట్టూ తిరగడం మాని అభివృద్ధి దిశగా సాగాలని ప్రశాంత్ కిశోర్ హితవు పలికారు.విద్యావ్యవస్థ మెరుగుదల, స్థానిక ఉపాధి కల్పన, బీహార్ నుండి వలసల నివారణ వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.గతంలో జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా ఓట్లు అడిగిన బీజేపీ, అదే తరహా రాజకీయాలకు ప్రతీకగా ఉన్న వ్యక్తికి కాషాయ కండువా కప్పి సీఎం కుర్చీలో కూర్చోబెడితే ప్రజలు సహించరని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రచారాన్ని ప్రశాంత్ కిశోర్ తోసిపుచ్చారు. శాసనసభలో ఎన్‌డీఏకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ప్రభుత్వం సుస్థిరంగానే ఉంటుందని, అయితే సీఎం నాయకత్వంలో మార్పు వచ్చే అవకాశం మెండుగా ఉందన్నారు.ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వీ యాదవ్ రాబోయే నాలుగేళ్లలో ప్రజా సమస్యలపై ఎంత పోరాటం చేస్తారనే దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

