Honour Killing : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర పరువు హత్య (Honour Killing) కలకలం రేపింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుటుంబ పరువు పోయిందని భావించిన తండ్రి, సోదరుడే కలిసి 22 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశారు.
ఈ ఘాతుకాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసుల సమగ్ర విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని సర్కేజ్ ప్రాంతానికి చెందిన సోఫియా (22) అనే యువతి తన ప్రియుడితో ఉన్న వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె తండ్రి మహమ్మద్ ఫరూక్ నవాబ్‌ఖాన్ (56), సోదరుడు హబిల్ ఫరూక్ (38) తమ కమ్యూనిటీలో పరువు పోయిందని ఆవేదన చెందారు. యువతిని బెదిరించినప్పటికీ, ఆమెను అంతమొందించాలని పక్కా ప్రణాళిక రచించారు.
Read Also: Kanpur Crime : ఇంట్లో సీసీటీవీ నిఘా..పనిమనిషితో కలిసి మామను హతమార్చిన కోడలు
Honour Killing
Honour Killing : సుత్తితో దాడి - రోడ్డు ప్రమాదంగా నాటకం
ఆగస్టు 12న రాత్రి సోఫియాను ఆమె సోదరుడు హబిల్ బైక్‌పై ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడే ముందే వేచి ఉన్న తండ్రితో కలిసి సుత్తితో ఆమె తలపై తీవ్రంగా కొట్టి హత్య చేసేందుకు యత్నించారు. తీవ్ర గాయాలపాలైన సోఫియాను తామే ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వాహనం తమ బైక్‌ను ఢీకొట్టిందని, అందువల్లే సోఫియాకు గాయాలయ్యాయని వైద్యులను, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. తల, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ సోఫియా మరణించింది. బాధితురాలికి అయిన గాయాలు రోడ్డు ప్రమాదం వల్ల అయినవి కావని వైద్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబ సభ్యుల మాటల్లో పరస్పర విరుద్ధ ప్రకటనలను గమనించారు. సాంకేతిక ఆధారాలు, విచారణ వేగవంతం చేయడంతో తండ్రి, సోదరుడే ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

