Mumbai Rains: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని వరుణుడు వణికేలా చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న రికార్డు స్థాయి భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ (IMD) ముంబైతో పాటు దాని పరిసర ప్రాంతాలకు అత్యంత ప్రమాదకరమైన 'రెడ్ అలర్ట్' (Red Alert) జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో నగరంలో మరింత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Read Also:Madhya Pradesh Floods: మూడు రాష్ట్రాల్లో వానల బీభత్సం.. జలమయమైన నగరాలు!
విద్యాసంస్థల మూసివేత.. విద్యార్థుల భద్రతకే ప్రాధాన్యం

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముంబై నగర పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు (Schools), కళాశాలలకు (Colleges) తక్షణమే సెలవులు ప్రకటిస్తూ బీఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర విధుల్లో ఉండే సిబ్బంది మినహా మిగిలిన వారంతా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు.
Mumbai Rains: 100 mm దాటిన వర్షపాతం.. మునిగిన లోతట్టు ప్రాంతాలు
నగరంలోని పలు ప్రాంతాల్లో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 100 మిల్లీమీటర్లకు (100 mm) పైగా భారీ వర్షపాతం నమోదైనట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు.
- రవాణా వ్యవస్థకు బ్రేక్: భారీ వర్షాల కారణంగా ముంబైలోని ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌లు జలమయమయ్యాయి. దీంతో లోకల్ రైళ్లు, బస్సు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
- ప్రజలకు బీఎంసీ అడ్వైజరీ: నగరంలో వరద ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ముఖ్యంగా తీర ప్రాంతాలు, మ్యాన్‌హోల్స్ ఉన్న వైపు వెళ్లొద్దని బీఎంసీ అధికారులు హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Epaper: epaper.vaartha.com

