Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భవన నిర్మాణ పర్మిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

భవన నిర్మాణ పర్మిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

వార్త 4 days ago

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల నిర్మాణ అనుమతుల ప్రక్రియపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) ఒక చారిత్రాత్మక మార్గదర్శకత్వాన్ని ఇచ్చింది.

భూమి యాజమాన్య హక్కుల (టైటిల్)కు సంబంధించిన తగాదాలు లేదా వివాదాలు ఉన్నాయనే నెపంతో గ్రామ పంచాయతీలు భవన నిర్మాణ అనుమతులను నిరాకరించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి హక్కుల వివాదాలను విచారించి, పరిష్కరించే పరిధి కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి కీలక తీర్పును వెలువరించారు.

Read also: Tobacco : భారీగా పడిపోయిన పొగాకు ధర

నంద్యాల జిల్లా పిటిషన్‌పై విచారణ.. పంచాయతీ తీర్మానం రద్దు

నంద్యాల జిల్లా, మహానంది మండలం పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కె. జమాల్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన అనంతరం న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ జమాల్ రెడ్డి స్థల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఓ థర్డ్ పార్టీ (మూడో పక్షం) పంపిన లీగల్ నోటీసును ఆధారం చేసుకుని, అతనికి భవన నిర్మాణ అనుమతిని నిరాకరిస్తూ 2023 డిసెంబర్ 24న స్థానిక గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది.

AP High Court: వివాదం ఏంటి? బాధితుడి వాదన ఇదీ..

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. జమాల్ రెడ్డి 2009లోనే సీతారాంపురంలోని సర్వే నంబర్ 408లో 4 సెంట్ల (195.5 చదరపు గజాలు) నివాస స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. నాటి నుంచి ఆయన క్రమం తప్పకుండా ఇంటి పన్ను చెల్లిస్తూ అక్కడే నివసిస్తున్నారు. అయితే, తన పాత ఇల్లును కూల్చేసి కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని భావించిన ఆయన అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా, పంచాయతీ కార్యదర్శి మొదట షోకాజ్ నోటీసు ఇచ్చారు. దానికి స్పందించిన జమాల్ రెడ్డి.. భవన నిర్మాణ ప్లాన్, చలాన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.

16 ఏళ్లుగా లేని వివాదం.. అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

అయితే, సదరు స్థలాన్ని విక్రయించిన వ్యక్తి సోదరుడి వారసులు 2023 డిసెంబర్‌లో ఒక లీగల్ నోటీసు ఇస్తూ, 2009 నాటి సేల్ డీడ్ చెల్లదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ నోటీసును సాకుగా చూపి పంచాయతీ అధికారులు జమాల్ రెడ్డి కొత్త ఇంటి దరఖాస్తును తిరస్కరించారు.

దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దాదాపు 16 సంవత్సరాలుగా సదరు స్థల వివాదంపై ఎలాంటి సివిల్ కోర్టును ఆశ్రయించని వ్యక్తులు ఇచ్చిన లీగల్ నోటీసును పట్టుకుని, నిర్మాణ అనుమతులు ఆపడం చట్టవిరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది. భవన నిర్మాణ దరఖాస్తులు వచ్చినప్పుడు.. దరఖాస్తుదారుడి పేరిట టైటిల్ ఉందా, సదరు భూమి ఆయన ఆధీనంలో (స్వాధీనం) ఉందా అనే ప్రాథమిక అంశాలను మాత్రమే పంచాయతీలు చూడాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో, రాబోయే 15 రోజుల్లోగా పిటిషనర్ జమాల్ రెడ్డి అప్లికేషన్‌ను పరిశీలించి, చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

ఏపీఎల్-2026 షురూ.. తొలి మ్యాచ్‌లోనే పరుగుల విధ్వంసం సృష్టించిన కాకినాడ కింగ్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha