Bhuvneshwar Kumar: స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు.
అయితే ఇంతకాలం జాతీయ జట్టుకు దూరంగా ఉండటం, ఇప్పుడు తిరిగి రావడం వెనుక సెలక్షన్ కమిటీలో చోటుచేసుకున్న మార్పులు కూడా కారణమనే చర్చ మొదలైంది.
Smriti Mandhana: భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
ఐపీఎల్‌లో అదరగొట్టిన భువీ

గత ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవడంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో 17 వికెట్లు తీసిన అతడు పవర్‌ప్లేలో తన స్వింగ్, సీమ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అయినప్పటికీ గత జాతీయ సెలక్షన్ కమిటీ హయాంలో అతడికి టీమిండియాలో చోటు దక్కలేదు. భువీ ఎంపిక కోసం సెంట్రల్ జోన్ సెలెక్టర్ రుద్ర ప్రతాప్ సింగ్ ప్రయత్నించినప్పటికీ ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని సమాచారం.
అగార్కర్ తర్వాత మారిన పరిస్థితులు?
మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత భువనేశ్వర్ ఎంపికకు మార్గం సుగమమైందనే ప్రచారం జరుగుతోంది. తాత్కాలిక చీఫ్ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజాతో పాటు ఇతర సెలెక్టర్లకు భువీ అనుభవం, ప్రస్తుత ఫామ్ గురించి వివరించడం సులభమైందని సమాచారం. అయితే భువనేశ్వర్‌ను అగార్కర్ వ్యక్తిగత కారణాలతో పక్కన పెట్టారనే దానికి అధికారిక ఆధారాలు లేవు. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ విధానం ప్రధానంగా భవిష్యత్ జట్టును నిర్మించడంపైనే దృష్టి పెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్ల విషయంలో సెలక్షన్ కమిటీ కఠిన నిర్ణయాలు తీసుకుందని వారి అభిప్రాయం.
యువ పేసర్లకు భువీ అనుభవం ఉపయోగపడేనా?
జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేని పరిస్థితుల్లో భువనేశ్వర్ అనుభవం భారత జట్టుకు ఉపయోగపడుతుందని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువ పేసర్లు మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లకు భువీ అనుభవం మార్గదర్శకంగా ఉంటుందని అంచనా. 2028 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ పేసర్లను తీర్చిదిద్దే క్రమంలో భువనేశ్వర్ పాత్ర కీలకం కావచ్చని భావిస్తున్నారు.
భువీ రికార్డు ఇదే..
భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు భారత్ తరఫున 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 90 వికెట్లు తీసుకున్నాడు. కొత్త తరం బౌలర్లకు తన అనుభవాన్ని పంచుకోవడంతో పాటు, అవసరమైన సమయంలో వికెట్లు తీయగల సామర్థ్యం అతడి బలంగా ఉంది. భువీ రీఎంట్రీతో మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలపై చర్చ మొదలయ్యే అవకాశం ఉంది.
Bhuvneshwar Kumar: అక్టోబర్ 22 నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్
భారత్-న్యూజిలాండ్ ఐదు టీ20ల సిరీస్ అక్టోబర్ 22న ప్రారంభం కానుంది. తొలి రెండు మ్యాచ్‌లు క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతాయి. అక్టోబర్ 27న వెల్లింగ్టన్‌లో మూడో టీ20, అక్టోబర్ 30న ఆక్లాండ్‌లో నాలుగో మ్యాచ్ జరగనుంది. నవంబర్ 1న హామిల్టన్‌లో చివరి టీ20తో సిరీస్ ముగుస్తుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియా జెర్సీలో భువనేశ్వర్ కుమార్ కనిపించనుండటంతో అతడి రీఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Epaper: epaper.vaartha.com

