Yang Youlin Corruption Case: అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న చైనా ప్రభుత్వం మరో కీలక అధికారికి అత్యంత కఠినమైన శిక్ష విధించింది. మూడు దశాబ్దాల పాటు తన అధికార పరిధిని ఉపయోగించుకుని ఏకంగా 2.21 బిలియన్ యువాన్లు (సుమారు రూ.2,800 కోట్లు) లంచాల రూపంలో తీసుకున్న నానింగ్ డెవలప్‌మెంట్ జోన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డిప్యూటీ డైరెక్టర్ యాంగ్ యూలిన్ (Yang Youlin) కు కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.
ఇటీవలి కాలంలో చైనాలో వెలుగుచూసిన అతిపెద్ద ఆర్థిక నేరాల కేసుల్లో ఇదొకటిగా నిలిచింది.
మూడు దశాబ్దాల అక్రమ సామ్రాజ్యం

జ్యాంగ్సు ప్రావిన్స్‌లోని చాంగ్‌జౌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు (Changzhou Intermediate People’s Court) ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపి సోమవారం తీర్పును వెలువరించింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. యాంగ్ యూలిన్ 1993 నుంచి 2023 వరకు వివిధ ప్రభుత్వ హోదాల్లో కొనసాగుతూ పలు నిర్మాణ కాంట్రాక్టులు, వ్యాపార అనుమతులు, భూముల కేటాయింపులు, వర్కింగ్ క్యాపిటల్ (ఫైనాన్సింగ్) వంటి అంశాల్లో ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు అక్రమంగా సాయం చేశారు. లంచాలు స్వీకరించడంతో పాటు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ప్రజాధనాన్ని మళ్లించడం, మనీలాండరింగ్, ఇతర అధికారులకు లంచాలు ఇవ్వడం వంటి తీవ్రమైన ఆరోపణల్లో ఆయన దోషిగా తేలారు. లంచాల రూపంలో వచ్చిన సొమ్మును తన సొంత నియంత్రణలో ఉన్న కంపెనీలకు రుణాలుగా మళ్లిస్తూ, ఆ డబ్బును లీగల్ మనీగా మార్చేందుకు ప్రయత్నించినట్లు కోర్టు నిర్ధారించింది.
ఆస్తులు జప్తు – పశ్చాత్తాపం వ్యక్తం చేసినా నో యూజ్
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ కేసుపై బహిరంగ విచారణలు జరిగాయి. విచారణ సందర్భంగా యాంగ్ యూలిన్ తన తప్పులను అంగీకరించి, పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు న్యాయస్థానం పేర్కొంది. అయినప్పటికీ, ఆయన చేసిన నేరాల తీవ్రత దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజా ప్రయోజనాలకు తీరని నష్టం చేకూర్చాయని స్పష్టం చేస్తూ కోర్టు మరణశిక్ష విధించింది. ఆయనకు చెందిన వ్యక్తిగత ఆస్తులన్నింటినీ తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, లంచంగా పొందిన మొత్తం సొమ్మును రికవరీ చేయాలని ఆదేశించింది.
Yang Youlin Corruption Case:షీ జిన్‌పింగ్ యాంటీ-గ్రాఫ్ డ్రైవ్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’లో భాగంగానే ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ డ్రైవ్‌ను జిన్‌పింగ్ తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి వాడుకుంటున్నారనే విమర్శలు కూడా అంతర్జాతీయంగా ఉన్నాయి. చైనాలో ఆర్థిక నేరాలకు మరణశిక్షలు విధించడం అరుదైనప్పటికీ, గత కొన్ని ఏళ్లుగా అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 2021లో చైనా హుయారోంగ్ ఇంటర్నేషనల్ మాజీ అధికారి లై షియామిన్‌ను, అలాగే 2024లో ఇన్నర్ మంగోలియాకు చెందిన మాజీ అధికారి లీ జియాన్‌పింగ్‌కు కూడా చైనా మరణశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో ఇప్పుడు యాంగ్ యూలిన్ చేరారు.
Epaper: epaper.vaartha.com
చైనాలో 'మైసాక్' తుఫాన్ బీభత్సం.. 74.5 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం

