CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ బుధవారం చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ మహిళా, శిశు ఆసుపత్రిలో అకస్మాత్తుగా పర్యటించి తనిఖీలు నిర్వహించారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాయింట్లన్నీ తన డైరీలో నోట్స్ రాసుకుంటూ వార్తల్లో నిలిచిన సీఎం విజయ్, ఈ ఆసుపత్రి తనిఖీ సమయంలోనూ చేతిలో డైరీతో కనిపించడం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఆయనతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.జి. అరుణ్‌రాజ్ మరియు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.
Read Also : Indias First Hydrogen Train: జులై 17న పట్టాలెక్కనున్న భారత తొలి హైడ్రోజన్ రైలు
CM Vijay’s surprise inspection at a Chennai hospital.
CM Vijay: వైద్య సేవలు, లంచాల వేధింపులపై ఆరా
ఎగ్మోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో లంచాల వేధింపులు మరియు పారిశుద్ధ్య లోపాలు తీవ్రంగా ఉన్నాయంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి విజయ్ నేరుగా ఆసుపత్రికి చేరుకుని ప్రసూతి, గైనకాలజీ వార్డులతో పాటు పలు కీలక విభాగాలను స్వయంగా పరిశీలించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని లోపాలను తక్షణమే సరిదిద్దాలని, పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని అధికారులను ఆయన తీవ్రంగా ఆదేశించారు.
నవజాత శిశువులను ఎత్తుకుని మురిసిపోయిన ముఖ్యమంత్రి
ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా సీఎం విజయ్ సాధారణ రోగులు, వారి కుటుంబ సభ్యులతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రసవానంతర వార్డులలో చికిత్స పొందుతున్న బాలింతలను కలిసి వారి యోగక్షేమాలను ఆరా తీశారు. కొందరు నవజాత శిశువులను (న్యూ బోర్న్ బేబీస్) ఎంతో ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని లాలించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై, వారి విధుల్లో ఎదురవుతున్న సవాళ్లు మరియు ఆసుపత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

