Mahabubabad School Van Accident: మహబూబాబాద్ జిల్లాలో శనివారం ఒక తీవ్ర దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది.
ఈ ఘటన కురవి మండలం తిర్లాపురం గ్రామ శివారులో జరిగింది.
School vehicle plunges into a pond and overturns
Mahabubabad School Van Accident: డ్రైవర్ ఫోన్ సంభాషణే ప్రమాదానికి కారణం?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండల కేంద్రంలోని గీతాంజలి పాఠశాలకు చెందిన ‘టాటా మ్యాజిక్’ (Tata Magic) వాహనం శనివారం ఉదయం రోజువారీలాగే విద్యార్థులను ఎక్కించుకునేందుకు సమీప గ్రామాలకు వెళ్లింది. వివిధ గ్రామాల నుంచి సుమారు 14 మంది విద్యార్థులను వాహనంలో ఎక్కించుకుని పాఠశాలకు తిరిగి వస్తుండగా తిర్లాపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండటమే కాకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించడం వల్లే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లి పల్టీ కొట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నలుగురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
వాహనంలో ఉన్న 14 మంది విద్యార్థుల్లో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బయటకు తీసి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
స్కూల్ వాహనం చెరువులో పడిపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, వాహనంలో ఉన్న విద్యార్థులందరి క్షేమసమాచారాలపై అధికారులు అధికారిక ప్రకటన జారీ చేయాల్సి ఉంది.

