Moinabad Crime: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో శనివారం తెల్లవారుజామున ఒక తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అడవి పందుల బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Read Also : Hyderabad: హాస్టల్ ముసుగులో అక్రమ దందా.. హైదరాబాద్‌లో ఫెర్టిలిటీ రాకెట్ గుట్టురట్టు
Two engineering students who went into a field die tragically from an electric shock
Moinabad Crime: పోలీసులను చూసి పరుగులు తీస్తూ ప్రమాదంలో చిక్కుకొని..
రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లికి చెందిన మోక్షచరణ్ (20), బల్కంపేటకు చెందిన యశ్వంత్ (20) అనే ఇద్దరు యువకులు చిలుకూరులోని కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వీరు శుక్రవారం రాత్రి మరికొందరు మిత్రులతో కలిసి పెద్దమంగళారం సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మద్యం సేవించడానికి వెళ్లారు.
తెల్లవారుజామున 2 గంటల సమయంలో వీరు మద్యం సేవిస్తుండగా, ఆ మార్గంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చింది. పోలీసులకు దొరికిపోతామనే భయంతో మోక్షచరణ్, యశ్వంత్ చీకట్లో పొలాల గుండా పరుగులు తీశారు. అయితే, అక్కడ అడవి పందుల నిరోధానికి పొలం చుట్టూ అమర్చిన విద్యుత్ తీగలను గమనించకపోవడంతో, వాటికి తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ప్రమాదం జరిగిన వెంటనే తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు విద్యార్థులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఇతర విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

