Pune Crime: మహారాష్ట్రలోని పూణే జిల్లా పింప్రి-చించ్వాడ్‌లో శుక్రవారం సాయంత్రం ఒక తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఒక మహిళ, తన 6 ఏళ్ల కన్న కొడుకుతో కలిసి రెసిడెన్షియల్ భవనంలోని 18వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.
Tragedy: Woman jumps from 18th floor with her son
Pune Crime: కారిడార్ డక్ట్ నుంచి కిందకు దూకి తల్లి, కుమారుడు మృతి
పూణేలోని ఐటీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న మనోజ్ బంగాడ్, ఆయన భార్య ఏక్తా బంగాడ్ (33), ఆరేళ్ల కుమారుడు మాధవ్‌లతో కలిసి పింప్రి-చించ్వాడ్‌లోని 'సిగ్నేచర్ పార్క్' నివాస భవనంలో ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో ఏక్తా తన కుమారుడిని భవనం 18వ అంతస్తుకు తీసుకెళ్లి, అక్కడి కారిడార్‌లోని డక్ట్ నుంచి కిందకు దూకింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన తల్లీబిడ్డలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
8 పేజీల సూసైడ్ నోట్.. భర్త పునర్వివాహం కోసమేనంటూ లేఖ
ఈ ఘటనపై వాకడ్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతురాలు ఏక్తా రాసిన 8 పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన ఆరోగ్య సమస్యలు, కుటుంబ పరిస్థితులు, భర్త భవిష్యత్తు గురించి ఆమె ప్రస్తావించింది. కొన్నేళ్లుగా తీవ్రమైన వెన్నెముక సమస్యతో బాధపడుతున్నానని, ఎన్నో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ ఉపశమనం లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
తన మరణం తర్వాత భర్త మరో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరింది. అలాగే తాను లేకపోతే కుమారుడు తన గురించి పదేపదే అడుగుతూ భర్తను ఇబ్బంది పెట్టవచ్చని, బాబు ఉండటం వల్ల భర్త రెండో వివాహానికి ఆటంకం కలగవచ్చని భావించినట్లు లేఖలో పేర్కొంది. ఈ కారణాలతోనే కుమారుడిని కూడా తనతో పాటు తీసుకెళ్తున్నట్లు రాసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి వాకడ్ పోలీసులు ఈ ఘటనను యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR)గా నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.
షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డ మృతి

