Dada Movie: నటసింహం నందమూరి బాలకృష్ణ గాయం నుంచి పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దాదా' షూటింగ్‌లో పాల్గొన్నారు.
కర్ణాటకలోని మైసూరు వేదికగా ఈ సినిమా నూతన షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న బాలకృష్ణ, ఇప్పుడు పూర్తి ఉత్సాహంతో తిరిగి షూటింగ్‌లో చేరడం విశేషం.
Read Also : RC : చరణ్- సుకుమార్ సినిమా లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
‘Dada’s’ new schedule: Balakrishna participates in the shoot.
Dada Movie: మైసూరులో కీలక షెడ్యూల్ ప్రారంభం
చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం మైసూరులో జరుగుతున్న ఈ షెడ్యూల్ సినిమాకు చాలా కీలకమైంది. ఇందులో ప్రధానంగా టాకీ పార్ట్‌తో పాటు బాలకృష్ణ, ఇతర ముఖ్య నటీనటులపై పలు ఆసక్తికర సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా నిర్మాణంలో ఒక ముఖ్యమైన దశ ముగుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. బాలకృష్ణ పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావడంతో చిత్ర బృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది.
గాయం, శస్త్రచికిత్స వివరాలు
గతంలో కాకినాడలో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ కండరానికి స్వల్ప గాయమైన విషయం తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఒక చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ఓ ప్రకటన విడుదల చేస్తూ, బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ఆయన సెట్స్‌కు తిరిగి వస్తారని అభిమానులకు భరోసా ఇచ్చింది. చెప్పినట్టుగానే, ఆయన పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి షూటింగ్‌లో చేరారు.
భారీ అంచనాల నడుమ ‘దాదా’.. డిసెంబర్‌లో విడుదల!
‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘దాదా’పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణను పవర్‌ఫుల్ మాస్ అవతార్‌లో చూపిస్తూ, స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సాయి మాధవ్ బుర్రా మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

