CM Revanth Delhi Visit: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు.
తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
CM Revanth Reddy meets Union Minister Rammohan Naidu in Delhi.
CM Revanth Delhi Visit: ఆదిలాబాద్, మామునూర్ విమానాశ్రయాల అభివృద్ధిపై ఫోకస్
ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్‌లోని మామునూర్ ఎయిర్‌పోర్ట్, అలాగే ఆదిలాబాద్‌లోని పాత విమానాశ్రయాల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల విస్తరణ అంశాలు చర్చకు వచ్చాయి. ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ (ఉడాన్) కింద ఈ విమానాశ్రయాల నుండి త్వరగా సర్వీసులు ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన భూసేకరణ, రన్‌వే విస్తరణ వంటి తదుపరి చర్యలను వేగవంతం చేస్తామని సీఎం వివరించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక హబ్‌లను అనుసంధానించేలా విమాన సర్వీసులను మరింత విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు, ఉత్తర తెలంగాణ వాసులకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ఎంతో కీలకంగా మారనుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

