Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. స్తంభించిన ట్రాఫిక్!

ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. స్తంభించిన ట్రాఫిక్!

వార్త 2 weeks ago

Delhi Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలను (ఎన్‌సీఆర్) శుక్రవారం కుండపోత వర్షాలు తీవ్రంగా అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల ధాటికి నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోవడంతో పాటు ప్రధాన రహదారులు, అండర్‌పాస్‌లు జలమయమయ్యాయి.

ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి జనజీవనం తీవ్రంగా అస్తవ్యస్తమైంది. శ్రావణ మాసం ఆగస్టు తొలి వారంలో 2011 సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ-బదర్‌పూర్ రోడ్డు జలమయమైంది. ఇక్కడి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో సుమారు నాలుగు అడుగుల మేర వర్షపు నీరు చేరడంతో వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. ఓఖ్లా మోర్, ఖాన్‌పూర్, సంగమ్ విహార్ వంటి ప్రాంతాలు కూడా నీట మునిగాయి. నీటిలో చిక్కుకున్న వాహనాలను బయటకు తీసేందుకు ఎయిర్ ఫోర్స్ ట్రక్కులతో సహాయక చర్యలు చేపట్టారు. అలాగే ఐటీఓ, పటేల్ రోడ్, రోహతక్ రోడ్, ఢిల్లీ-జైపూర్ హైవే వంటి మార్గాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.

Read Also : Artificial Intelligence : ఇండియాలో AI తో పెరుగుతున్న ఉద్యోగాలు ..రిపోర్ట్

 Deluge in Delhi… Traffic brought to a standstill!

Delhi Heavy Rains: ఇళ్లు కూలి, ఆసుపత్రుల్లోకి వర్షపు నీరు

ఈ భారీ వర్షాల ధాటికి నగరంలో తొమ్మిది ఇళ్లు కూలిపోగా, 16 ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ విభాగం వెల్లడించింది. ఒక ఇంటిపై చెట్టు కూలడంతో లోపల చిక్కుకున్న ముగ్గురు మహిళలను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. మరోవైపు నోయిడాలో నీటితో నిండిన అండర్‌పాస్‌లో ఒక అంబులెన్స్ అరగంటకు పైగా చిక్కుకుపోగా, గురుగ్రామ్‌లోని సివిల్ హాస్పిటల్ బేస్‌మెంట్‌లోకి వర్షపు నీరు చేరడంతో వైద్య సేవలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

వర్షపాతం వివరాలు & రెడ్ అలర్ట్

శుక్రవారం ఉదయం నాటికి సఫ్దర్‌జంగ్‌లో 59.2 మి.మీ, లోధి రోడ్డులో 60.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా, ఫరీదాబాద్‌లో రికార్డు స్థాయిలో 119.4 మి.మీ వర్షపాతం కురిసింది. పరిస్థితి తీవ్రతను బట్టి భారత వాతావరణ శాఖ (IMD) ఈ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం రోజంతా భారీ వర్షాలు కొనసాగుతాయని, శనివారం నుంచి వర్ష తీవ్రత తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు.

లోక్‌సభలో ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి బిల్లు ఆమోదం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha