AP Govt Doctors Dismissed: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య సేవలకు ఆటంకం కలిగిస్తూ, సుదీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏళ్ల తరబడి విధులకు రావడం లేదనే కారణంతో 43 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్య వ్యవస్థలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఈ కఠిన చర్యల ద్వారా స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలను వెల్లడించారు.
Unauthorized Absence Doctors Terminated
Read also: El Nino Impact AP Farming: ఎల్‌నినో పరిస్థితులపై సమీక్ష.. వ్యవసాయ శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతోనే వేటు
గత నాలుగేళ్లుగా ఈ 43 మంది వైద్యులు విధులకు హాజరుకావడం లేదని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా వారికి పలుమార్లు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, శాఖాపరమైన అభియోగాలు కూడా నమోదు చేసింది. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, నిబంధనల ప్రకారం వారిని సర్వీసుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్-1964 ప్రకారం.. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏడాదికి మించి అనధికారికంగా విధులకు గైర్హాజరైతే వారిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ రూల్స్ ఆధారంగానే ప్రస్తుత చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమని, విధులను విస్మరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు.
AP Govt Doctors Dismissed: నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి కఠిన చర్యలు
వైద్య ఆరోగ్య శాఖలో జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న రెండో పెద్ద నిర్ణయం ఇది. గత నెలలోనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని వివిధ ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తూ విధులకు ఎగ్గొట్టిన 51 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లను శాశ్వతంగా తొలగించారు. ఇదే సమయంలో మరో 34 మంది వైద్యులపై చార్జ్ షీట్ దాఖలు చేయగా.. వారు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. ఇందులో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది.
లిస్టులో మరో 118 మంది వైద్యులు..
మరో ముగ్గురు ప్రొఫెసర్లపై కూడా త్వరలోనే క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) పరిధిలో సుమారు 118 మంది వైద్యులు ఇంకా అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వారిపై కూడా దశలవారీగా చట్టపరమైన చర్యలు ఉంటాయని, ప్రభుత్వ వైద్య సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

