Telangana Aviation Academy: తెలంగాణలోని విద్యార్థులకు విమానయాన (ఏవియేషన్) రంగంలో అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు, అత్యుత్తమ శిక్షణ కల్పించే లక్ష్యంతో సాంకేతిక విద్యాశాఖ ఒక కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ పాత ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ‘తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ’ (TGSAA) తో సాంకేతిక విద్యాశాఖ చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు సమక్షంలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది.
ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ (JNGP) కళాశాలలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ (AME) మూడేళ్ల డిప్లొమా కోర్సు చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యక్ష శిక్షణ లభిస్తుంది. తరగతి గది థియరీతో పాటు ల్యాబ్ ప్రాక్టికల్స్, ఆధునిక ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్‌పై నేరుగా ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ కల్పిస్తారు.
Read Also : KTR's farmhouse : బీఆర్‌ఎస్ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు
New avenues for Telangana students in the aviation sector.
Telangana Aviation Academy: ఇండస్ట్రియల్ ట్రైనింగ్
డిప్లొమా చివరి ఏడాది విద్యార్థుల కోసం TGSAA లో ఏడాది పాటు దాదాపు 2,100 గంటల సుదీర్ఘ నిడివితో ప్రత్యక్ష ప్రాక్టికల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ పొందే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల విద్యార్థులు విమానాల నిర్వహణలోని సూక్ష్మాంశాలను నేరుగా నేర్చుకునే వీలుంటుంది.
విమానాల నిర్వహణలో ఏవియేషన్ సేఫ్టీ, సెక్యూరిటీ ప్రమాణాలకు ఈ శిక్షణలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రోగ్రామ్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) నిబంధనలకు అనుగుణంగా సాగుతుంది. ఈ ఎంఓయూ ద్వారా విద్యార్థులకు ప్రముఖ ఎయిర్‌లైన్స్, ఎంఆర్‌ఓ (MRO)లు, ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థలతో నేరుగా అనుసంధానం ఏర్పడి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఐదేళ్ల కాలపరిమితితో ఒప్పందం
సాంకేతిక విద్యాశాఖ మరియు TGSAA మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం మొత్తం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. కోర్సులో 90 శాతం హాజరుతో పాటు ఉత్తమ పనితీరు కనబరిచిన విద్యార్థులకు అధికారిక ప్రాక్టికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ చొరవ తెలంగాణ యువతకు ఏవియేషన్ రంగంలో నైపుణ్యాలను పెంచి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు

