Rangareddy Crime: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుమార్తె తరచూ ఫోన్‌లో మాట్లాడుతోందనే కారణంతో ఓ తల్లి ఆగ్రహానికి గురై 14 ఏళ్ల బాలికను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో నిందితురాలిని అరెస్టు చేశారు.
Read Also :pakistan ambulance blast: ఘోర ప్రమాదం.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి 10 మంది మృతి
ఫోన్‌లో మాట్లాడుతోందని మందలింపులు
షాద్‌నగర్ జోన్ డీసీపీ శిరీష రాఘవేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండల కేంద్రానికి చెందిన రాజు, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు 14 ఏళ్లు. ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో తల్లి విజయలక్ష్మి పలుమార్లు మందలించింది. అయినప్పటికీ కుమార్తె ప్రవర్తనలో మార్పు రాలేదని భావించిన ఆమె ఆగ్రహానికి గురైంది.

ఇంట్లోనే ఉన్న కుమార్తెపై ఆగ్రహం
అక్టోబర్ 27న రాజు, విజయలక్ష్మి పని నిమిత్తం బయటకు వెళ్లారు. సాయంత్రం విజయలక్ష్మి ఒక్కతే ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో కుమార్తె పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఫోన్ చూస్తూ కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన విజయలక్ష్మి బాలిక గొంతు నులిమినట్లు పోలీసులు తెలిపారు. ఊపిరాడక బాలిక మృతిచెందింది. అనంతరం భర్త రాజుకు ఫోన్ చేసిన విజయలక్ష్మి.. తాను ఇంటికి వచ్చేసరికి కుమార్తె ఉరివేసుకుని కనిపించిందని చెప్పింది. దీంతో ఇంటికి చేరుకున్న రాజు బాలికను ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Rangareddy Crime: పోలీసుల విచారణలో వెలుగులోకి అసలు విషయం
ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అనుమానం వ్యక్తం చేసి విజయలక్ష్మిని విచారించారు. విచారణలో తానే కుమార్తెను హత్య చేసినట్లు ఆమె అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు. దీంతో నిందితురాలిని అరెస్టు చేశారు. ఫోన్‌లో మాట్లాడుతున్న విషయంపై తలెత్తిన వివాదం 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడానికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కొత్తూర్ ప్రాంతంలో కలకలం రేపింది.

