Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) విమర్శల పదును పెంచింది.
సూపర్ సిక్స్ మరియు ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజా సమస్యలను పక్కనబెట్టి కేవలం రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని వైసీపీ ఆరోపించింది.

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళా సంక్షేమం, పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్లు, బ్యాగుల పంపిణీ వంటి కీలక హామీలను కూటమి సర్కార్ అటకెక్కించిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా తయారైందని, ఈ కాలంలో చేసిన రూ. 3 లక్షల కోట్ల అప్పులకు సంబంధించి ప్రజలకు సమాధానం చెప్పే జవాబుదారీతనం ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు.
read also: Kiran Royal: ప్రకాశ్ రాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: జనసేన నేత కిరణ్ రాయల్
రాష్ట్రపతి పర్యటన వివాదం: సీఎంపై బొత్స ఆగ్రహం
ఇటీవల దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు స్వాగతం పలకకపోవడాన్ని బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం ఆ సమయంలో రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ, అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక గిరిజన మహిళా ప్రతినిధిని కలవడానికి సమయం కేటాయించకపోవడం ఆమెను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకే కూటమి ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ కాలక్షేపం చేస్తోందని ఎద్దేవా చేశారు.
Botsa Satyanarayana: ‘మావిగన్’ కారిడార్‌కే వైసీపీ జై.. అమరావతిపై ఆరోపణలు
రాష్ట్ర రాజధాని అంశంపై బొత్స సత్యనారాయణ తమ పార్టీ విధానాన్ని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (MAVIGAN – మావిగన్) కారిడార్‌కే తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో తక్కువ ఖర్చుతో కూడుకున్న అత్యుత్తమ ప్రత్యామ్నాయం ‘మావిగన్’ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. మరోవైపు అమరావతి ప్రాజెక్టు కేవలం కొందరు అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికేనని, అక్కడ పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని బొత్స ఆరోపించారు.
Epaper: epaper.vaartha.com

