Pranavi Chandra: బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్‌కు హైదరాబాద్ సీనియర్ మహిళల జట్టు సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి మహారాష్ట్రలోని పుణెలో జరగనున్న టోర్నమెంట్‌కు ప్రణవి చంద్ర వెలగపూడిని హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా నియమించారు.
వికెట్ కీపర్ ఎం. మమతను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) వెల్లడించింది.
Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కుమార్‌కు బిగ్ కమ్‌బ్యాక్.. అగార్కర్ తర్వాత మారిన సీన్!
కెప్టెన్సీ బాధ్యతలు ప్రణవికి

ప్రణవి గత మూడు సంవత్సరాలుగా హైదరాబాద్ సీనియర్ మహిళల జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. గత సీజన్‌లో ఆమె సౌత్ జోన్ టీ20, మల్టీడే జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో అతిథి ఆటగాడిగా కేరళ తరఫున కూడా ఆడారు. ప్రణవికి దేశవాళీ క్రికెట్‌తో పాటు విదేశాల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. గతంలో థాయ్‌లాండ్ పర్యటనలో హైదరాబాద్ సీనియర్ జట్టుకు సారథ్యం వహించిన ఆమె.. జట్టును టైటిల్ విజేతగా నిలిపారు.
విదేశాల్లోనూ క్రికెట్ అనుభవం
ప్రణవి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడే దేశాల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. బార్బడోస్‌లో జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నారు. అలాగే యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో ఈలింగ్ క్రికెట్, బిషప్ స్ట్రాట్‌ఫోర్డ్ క్లబ్‌ల తరఫున లీగ్ క్రికెట్ ఆడారు. ఈ అనుభవం పుణెలో జరగనున్న టీ20 టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Pranavi Chandra: హైదరాబాద్ జట్టు ఇదే
కెప్టెన్: ప్రణవి చంద్ర వెలగపూడి
వైస్ కెప్టెన్, వికెట్ కీపర్: ఎం. మమత
జట్టులోని ఇతర సభ్యులు:
గొంగడి త్రిష, ద్రితి కేసరి, ఎస్. యశస్వి, పూజా వాంకా, సంధ్య గోరా, కుంచాల నితీషా, ఎం. సాక్షి రావు, కావ్య శ్రీ, ఎడ్ల సృజన, క్రాంతి రెడ్డి నల్లా, కె. నిధి (వికెట్ కీపర్), పాల్త్య పార్వతి, తాటి కృష్ణవేణి.
స్టాండ్‌బై ఆటగాళ్లు:
వై. త్రిష పూజిత, కట్టా శ్రీవల్లి, శ్రీ బిల్వికా రెడ్డి, ఎం. శివాని గౌడ్, మేహా లక్ష్మి ఏడిగ. ఈ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు మెరుగైన ప్రదర్శనతో ముందుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Epaper: epaper.vaartha.com

