హైదరాబాద్ నగరంలోని మీ సేవ (Meeseva) కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాల్సిన మీ సేవ కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
బుధవారం నాడు ఖైరతాబాద్, అల్వాల్, అంబర్‌పేట్ వంటి కీలక ప్రాంతాల్లోని మీ సేవ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాల జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల సమయంలో కార్యాలయాల్లోని నగదు నిల్వలు, పెండింగ్ దరఖాస్తుల రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

దళారుల రాజ్యం.. సామాన్యులకు తప్పని ఇబ్బందులు
ఏసీబీ ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మీ సేవ నిర్వాహకులు, సిబ్బంది దళారులతో చేతులు కలిపి చక్రం తిప్పుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలు నేరుగా దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి పెండింగ్‌లో పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న సిబ్బంది, దళారుల ద్వారా అధిక ధరలు చెల్లించి వచ్చే దరఖాస్తులను మాత్రం గంటల వ్యవధిలో పరిష్కరిస్తున్నట్లు తేలింది. ప్రభుత్వ నిర్ణీత ఫీజు కంటే రెండు మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తూ సామాన్యులను పీడిస్తున్న తీరుపై బాధితులు ఏసీబీ అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు.
ఏసీబీ హెచ్చరిక
సోదాల సందర్భంగా లభించిన ఆధారాల ప్రాతిపదికన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. మీ సేవ సెంటర్లలో పనిచేసే సిబ్బంది వ్యక్తిగత వివరాలను, వారి బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా, కావాలని సర్టిఫికెట్లను పెండింగ్‌లో పెట్టి వేధించినా లైసెన్సుల రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పౌర సేవల్లో పారదర్శకత కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు మున్ముందు కూడా కొనసాగుతాయని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

