Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్మూజ్ జలసంధిలో మళ్లీ ముదిరిన ఉద్రిక్తతలు

హర్మూజ్ జలసంధిలో మళ్లీ ముదిరిన ఉద్రిక్తతలు

వార్త 1 week ago

America Attack On Iran: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ (War) మేఘాలు కమ్ముకున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు సాగుతుండగానే, మరోవైపు ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగడంతో హర్మూజ్ జలసంధి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అంతర్జాతీయ వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడికి దిగడంతో, అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంలోని కీలక క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు జరిపింది. ఇరు దేశాల మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియక ముందే ఇరాన్ దానిని ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ దళాలు జరిపిన దాడులకు సమాధానంగానే తాము ఈ శక్తివంతమైన ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల తీవ్రతకు దక్షిణ ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతమైన సిరిక్ సమీపంలో వరుసగా మూడు కంటే ఎక్కువ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా ఛానల్ ఐఆర్ఐబీ వెల్లడించింది.

Read Also: Pakistan Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం

 America Attack On Iran

America Attack On Iran: అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడి

అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతికారంగా తాము కూడా ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడులు చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. తమ డ్రోన్, రాడార్ కేంద్రాలను దెబ్బతీసినందుకు బదులుగానే ఈ ప్రతిదాడి జరిపినట్లు పేర్కొన్నప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాకు చెందిన ఏ నిర్దిష్ట స్థావరాలపై దాడులు చేశారనే పూర్తి వివరాలను ఇరాన్ సైన్యం వెల్లడించలేదు. ఈ దాడులు జరగడానికి ముందే ఇరాన్ సంయుక్త సైనిక కేంద్రం అధికారిక ప్రతినిధి ఇబ్రహీం అల్-ఫికార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా జరిపిన దురాక్రమణ చర్యను ఇరాన్ ఊరికే వదిలిపెట్టదని, తాము ఎంచుకున్న సరైన సమయం, స్థలంలో మునుపెన్నడూ లేని విధంగా సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ రాత్రి ఇరాన్ ఇవ్వబోయే సైనిక ప్రతిఘటన భూమిని కుదిపేస్తుందని, మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఉనికిని శాశ్వతంగా తుడిచిపెట్టేలా ఉంటుందని హెచ్చరించారు. చర్చల నెపంతో అమెరికా వెన్నుపోటు పొడిచిందని, ఈ చర్యకు అమెరికా తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సి వస్తుందని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు ఇబ్రహీం అజీజీ కూడా మండిపడ్డారు.

సింగపూర్ కార్గో నౌక ‘ఎవర్ లవ్లీ’పై దాడి

ఒమన్ దహిత్ రేవు సమీపంలో ప్రయాణిస్తున్న సింగపూర్ పతాకంతో ఉన్న ‘ఎవర్ లవ్లీ’ అనే అంతర్జాతీయ కార్గో నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శుక్రవారం రాత్రి ప్రొజెక్టైల్‌తో దాడి చేశారు. ఈ దాడిలో నౌక దెబ్బతిన్నప్పటికీ, అందులోని సిబ్బంది ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాలేదని అంతర్జాతీయ ఏజెన్సీలు వెల్లడించారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే, ఇరాన్ పారామిలిటరీ నావికాదళం తమ ముందస్తు లేకుండా హూర్మూజ్ జలసంధి గుండా ఏ నౌకలూ ప్రయాణించరాదని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఇరాన్ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కనీసం నాలుగు డ్రోన్లను ప్రయోగించిందని ఆయన వెల్లడించారు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లలో మూడింటిని తమ సాయుధ దళాలు గాల్లోనే విజయవంతంగా కూల్చివేసాయని పేర్కొన్నారు. కానీ, దురదృష్టవశాత్తూ ఒక డ్రోన్ అత్యంత ఖరీదైన పెద్ద కార్గో నౌక పైభాగంలో బలంగా దూసుకెళ్లిందని, దీనివల్ల ఆ నౌకకు కొంత నష్టం వాటిల్లిందని ట్రంప్ చెప్పారు. ఇరాన్ చేసిన ఈ పని స్పష్టంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని ట్రంప్ స్పష్టం చేశారు.

హింసకు హింసే సమాధానం: జేడీ వాన్స్ హెచ్చరిక

పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న పరిస్థితులపై వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్పందిస్తూ, ఇరాన్ స్వయంగా తమ దేశంతో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసిందని గుర్తు చేశారు. ఒక బాధ్యతాయుతమైన దేశంగా తాము దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. ఒప్పందం అమలు తీరుపై ఇరాన్‌కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే దౌత్యపరంగా మాట్లాడాలని, అంతేకాని అంతర్జాతీయ జలాల్లో బౌండరీలు దాటి హింసకు దిగితే, కచ్చితంగా హింసతోనే సమాధానం ఎదురవుతుందని గట్టిగా హెచ్చరించారు. ఇటీవలే అమెరికా, ఇరాన్ దేశాలు ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం ఇరాన్ ఎలాంటి అదనపు రవాణా రుసుములు లేదా ఆంక్షలు విధించకుండా 60 రోజుల పాటు హర్మూజ్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలను సజావుగా సాగనివ్వాలి. ఇందుకు బదులుగా అమెరికా సైన్యం ఆ ప్రాంతంలో విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేసి, ఇరాన్‌తో 60 రోజుల పాటు దౌత్యపరమైన అణు చర్చలు ప్రారంభించడానికి అంగీకరించింది. అయితే తాజా దాడులతో ఈ ఒప్పందం ప్రమాదంలో పడింది.

హర్మూజ్‌లో మళ్లీ యుద్ధ వాతావరణం..ఇరాన్‌పై అమెరికా దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha