Vizag LKG Student Death: విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. హోమ్‌వర్క్ పూర్తి చేయలేదనే కారణంతో టీచర్ మందలించడంతో ఎల్‌కేజీ (LKG) చదువుతున్న ప్రణయ్ తేజ్ (6) అనే బాలుడు తీవ్ర భయాందోళనకు గురై పాఠశాలలోనే ప్రాణాలు కోల్పోయాడు.
తరగతి గదిలో గుక్కపెట్టి ఏడుస్తూ ఉపాధ్యాయురాలిపైనే బాలుడు స్పృహతప్పి కుప్పకూలిపోయాడు. పాఠశాల యాజమాన్యం వెంటనే విద్యార్థిని కింగ్ జార్జ్ ఆసుపత్రికి (KGH) తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Read Also : Bhumana Karunakar Reddy: భూకబ్జా ఆరోపణల కేసులో విచారణకు హాజరైన భూమన
Vizag LKG Student Death: సిసిటివి (CCTV) దృశ్యాల ఆధారాలు
ఈ ఘటనకు సంబంధించిన పాఠశాల సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఉపాధ్యాయురాలు బాలుడి చెంపపై కొట్టడం, చేయి చూపిస్తూ తీవ్ర కోపంతో హెచ్చరించడం స్పష్టంగా నమోదయ్యాయి. టీచర్ ప్రవర్తన వల్లే తమ కుమారుడు భయాందోళనకు గురై మృతిచెందాడని ఆరోపిస్తూ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట భారీగా ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. బాలుడి మృతికి గుండెపోటు కారణమా లేదా ఉపాధ్యాయురాలి దాడి కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చిన్నారి మృతి చెందడంతో ఆ ప్రాంతంలో శోకసంద్రం అలుముకుంది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ భద్రపరిచారు.

