Kerala Road Accident: కేరళ రాష్ట్రంలో కళ్ల చెమర్చే కంటతడి పెట్టించే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు.
మృతులంతా పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా అధికారులు అనుమానిస్తున్నారు.

లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు
పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. శుక్రవారం రాత్రి 11:40 గంటల ప్రాంతంలో త్రిస్సూర్ జిల్లా కైపమంగలం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద జాతీయ రహదారి 66పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారులో ఎనిమిది మంది యువకులు గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వైపు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో హైవేపై నిర్మాణ పనులు జరుగుతుండగా రోడ్డు పక్కన ఆపి ఉంచిన గూడ్స్ లారీని వారి కారు అత్యంత వేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
Read also: Teachers Day : 'టీచర్స్ డే' వెనక ఉన్న స్టోరీ ఇదే..!
Kerala Road Accident: నుజ్జునుజ్జైన కారు.. శ్రమించి వెలికితీత
ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది లారీ కిందకు చొచ్చుకుపోయింది. దీంతో ప్రయాణికులు కారులోనే ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ కట్టర్లతో కారును కత్తిరించి లోపలి వారిని బయటకు తీశారు. అప్పటికే ఏడుగురు మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
దిండిగల్ విద్యార్థులుగా గుర్తింపు మరియు దర్యాప్తు
ఘటనా స్థలంలో లభించిన ఒక విద్యార్థి గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్) ఆధారంగా మృతులను తమిళనాడులోని దిండిగల్ ప్రాంతానికి చెందిన పీఎస్‌ఎన్ఏ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుగా ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం త్రిస్సూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. రోడ్డు పక్కన లారీని నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేయడమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తుండగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

