Kodanda Ram : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు అంశంపై నిరుద్యోగ యువత నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్ వద్ద నిరుద్యోగులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను అడ్డుకుని తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మద్దతు తెలిపిన తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం, ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ప్రెస్ క్లబ్ పరిసరాల్లో ఒక్కసారిగా నిరుద్యోగులు చుట్టుముట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Read ALso ; రేపు బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ.. మంత్రి పొన్నం

“మీకు 60 ఏళ్లకు MLC పదవి ఓకే.. మాకు 30 ఏళ్లకు నోనా?” – నిరుద్యోగుల సంచలన వ్యాఖ్యలు
కోదండరాంను నిలదీసిన క్రమంలో నిరుద్యోగ యువత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. “మీరు 60 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్సీ పదవి పొందవచ్చు కానీ, మేము 30 ఏళ్ల వయస్సులోనే ఉద్యోగానికి పనికిరామా?” అని ఘాటుగా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మాట నమ్మే తాము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశామని, ఇప్పుడు ఉద్యోగాల వయోపరిమితి పెంపు విషయంలో ప్రభుత్వం స్పందించకపోతుంటే ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ అనూహ్య నిరసనతో ఏం చెప్పాలో తెలియక ఎమ్మెల్సీ కోదండరాం అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోయారు.

