Telangana pensions:తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ చేయూత పింఛన్ల కోసం కొత్త దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.
పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పథకానికి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలలో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ. 2 లక్షల వార్షిక ఆదాయ పరిమితి ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు అని అధికారులు స్పష్టం చేశారు. వితంతువులు, తీవ్ర వ్యాధిగ్రస్తులు, బాధితులకు ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబానికి మూడు ఎకరాల మాగాణి లేదా ఏడున్నర ఎకరాల మెట్ట భూమి ఉన్నవారు, అలాగే నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారు అనర్హులు అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Application process for Cheyutha pensions begins.
ప్రైవేట్ ఉద్యోగ నిబంధనపై తీవ్ర వ్యతిరేకత
ఈ పింఛన్ మార్గదర్శకాలలో కుటుంబంలో ఎవరికైనా ప్రైవేట్ ఉద్యోగం ఉంటే ఆ కుటుంబానికి పింఛన్ రాదనే ఒక కఠినమైన నిబంధన చేర్చడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దరఖాస్తుదారులు తమ ఇంట్లో ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ లేరని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబంలో కొడుకు లేదా కుటుంబ సభ్యులు కేవలం పదిహేను నుండి ఇరవై వేల రూపాయల స్వల్ప వేతనంతో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, వారి వృద్ధులైన తల్లిదండ్రులకు పింఛన్ నిరాకరించడం జరుగుతుంది. తక్కువ జీతంతో నగరాల్లో జీవనం సాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉన్న సమయంలో, ప్రైవేట్ ఉద్యోగాన్ని సాకుగా చూపించి పింఛన్ ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Telangana pensions:సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల విజ్ఞప్తులు
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు తల్లిదండ్రులను చూడకపోతే జీతంలో కోత విధించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఉద్యోగుల విషయంలో ఎలాంటి చట్టపరమైన రక్షణలు ఉండవని ప్రజలు గుర్తు చేస్తున్నారు. తక్కువ జీతాల ప్రైవేట్ ఉద్యోగాలను ప్రాతిపదికగా తీసుకుని వృద్ధులకు పింఛన్లు నిలిపివేయడం సరికాదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల ఎంతో మంది పేద వృద్ధులు నష్టపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ప్రైవేట్ ఉద్యోగ నిబంధనను తొలగించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ నిబంధనపై పునరాలోచన చేసి అర్హులైన పేద కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Epaper: epaper.vaartha.com

