Visakhapatnam Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆనందపురం - అనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
Read Also:Peerzadiguda Girl Death Mystery: అర్ధరాత్రి నగ్నంగా వీధుల్లో యువతీ..ఊహించని ట్విస్ట్
లారీని బలంగా ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో విషాదం

పోలీసులు మరియు స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఒకే కుటుంబం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరగబోయే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరింది. కారు ఆనందపురం పరిసరాల్లోని గండిగుండం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి, ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా.. డ్రైవర్‌తో సహా నలుగురు అక్కడికక్కడే విగతజీవులుగా మారారు.
Visakhapatnam Road Accident:ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు.. కుమారుడు దుర్మరణం
ఈ ఘోర ప్రమాదంలో నరసరాపుపేట ఎమ్మెల్యే పీఏ (Personal Assistant) చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మరణించిన నలుగురిలో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, హైవే పోలీసులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలో ఉన్న చంద్రశేఖిర్‌ను తక్షణమే చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కారు డ్రైవర్ తెల్లవారుజామున నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక కారులో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Epaper: epaper.vaartha.com

