Indiramma Flats : హైదరాబాద్ వ్యాప్తంగా 'ఇందిరమ్మ టవర్స్' ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి ఆగస్టు 15తో దరఖాస్తుల గడువు ముగిసింది. నగర పరిధిలోని 16 నియోజకవర్గాల్లో మొత్తం 60 వేలకు పైగా దరఖాస్తులు రాగా, అప్పటి నుంచి ప్రక్రియ సజావుగా సాగుతుందో లేదోనని దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సొంత ఇల్లు, భూమి లేదా వాహనాలు ఉండకూడదనే నిబంధనల ఆధారంగా అధికారులు డిజిటల్ స్క్రీనింగ్ చేపట్టారు. క్షేత్రస్థాయిలో భూమి లేకపోయినా ఉన్నట్లు చూపించడం, ఇతరుల వాహనాలు అభ్యర్థుల పేరిట నమోదు కావడంతో ప్రారంభంలో సమస్యలు ఎదురయ్యాయి. లోపాలను సరిదిద్దేందుకు హౌసింగ్ బోర్డు ఆన్‌లైన్ సదుపాయం కల్పించగా, చివరికి పరిశీలన తర్వాత సుమారు 40,000 మందిని (75%) అనర్హులుగా తేల్చారు. మిగిలిన 20,000 మంది అర్హత గల దరఖాస్తుదారులతో ఆగస్టు 27 నుండి 31 వరకు పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహించారు.నియోజకవర్గానికి 480 మంది చొప్పున ‘సెలెక్ట్ లిస్ట్’లోకి తీసుకోగా, ప్రతి నియోజకవర్గానికి మరొక 120 మందిని ‘వెయిటింగ్ లిస్టు’లో ఉంచారు. మొత్తం మీద దాదాపు 10,000 మంది అభ్యర్థులు లాటరీ డ్రాలో ప్రాథమికంగా ఎంపికయ్యారు.
Danam Nagender: అనర్హత వేటుపై దానం నాగేందర్ కీలక కామెంట్స్!
Indiramma Flats
Indiramma Flats : ‘ఇంటింటి సర్వే’తో లబ్ధిదారుల్లో కొత్త కలవరం
లాటరీలో పేరు వచ్చినప్పటికీ లబ్ధిదారుల్లో ఆనందం పూర్తిగా కనబడటం లేదు. అధికారుల ‘సెకండ్ లెవెల్ ఇంటింటి రీ-సర్వే’ ప్రక్రియే ఇందుకు ప్రధాన కారణం. అధికారులు నేరుగా లబ్ధిదారుల ప్రస్తుత నివాసానికి వెళ్లి వారి అర్హతలను పునఃపరిశీలిస్తున్నారు. లాటరీలో ఎంపికైన అభ్యర్థిపై పొరుగువారు లేదా స్థానికులు అనర్హుడని అభ్యంతరం తె తెలిపినా, లేదా స్థానిక నివాసి కాదని తేలినా ఇల్లు రద్దవుతుంది. అనర్హులుగా తేలిన వారి స్థానంలో ‘వెయిటింగ్ లిస్టు’లో ఉన్న అభ్యర్థులకు ఫ్లాట్లను కేటాయిస్తారు. దీంతో ఎంపికైన వారు ఆధార్, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలతో అధికారుల చొరవ కోసం నిరీక్షిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన ఈ ఇంటింటి సర్వే మొదట నాలుగు రోజుల్లోనే పూర్తి చేయాలని భావించినా కొన్ని అడ్డంకుల వల్ల ఆలస్యమైంది. లబ్ధిదారుల నివాస చిరునామాలు సరిగ్గా లభించకపోవడం, తప్పుడు ఫోన్ నంబర్లు ఉండడం మరియు సిబ్బంది కొరతతో ఇతర విభాగాల వారికి ప్రత్యేక యాప్‌లపై శిక్షణ ఇవ్వాల్సి రావడం సర్వేను ఆలస్యం చేశాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తనిఖీలు పూర్తికాగా, మిగిలిన నియోజకవర్గాల్లో 70% సర్వే పూర్తయింది. హౌసింగ్ బోర్డు సమాచారం ప్రకారం అన్ని వివరాల సమగ్ర పరిశీలన పూర్తి చేసి ఈ వారంలోనే అర్హుల తుది (ఫైనల్) జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.

