Dailyhunt
మే డే సభలో కేటీఆర్ కార్మిలకులకు కీలక హామీ

మే డే సభలో కేటీఆర్ కార్మిలకులకు కీలక హామీ

వార్త 1 week ago

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్మికుల కష్టం, వారి శ్రమ విలువ తెలియడం లేదని, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన వారిని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికులను ‘అభివృద్ధి భాగస్వాములు’గా గౌరవించామని, ముఖ్యంగా కరోనా కష్టకాలంలో వలస కార్మికులను కన్నబిడ్డల్లా ఆదుకుని, వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రాణాలకు తెగించి మౌలిక సదుపాయాల కల్పనలో పాలుపంచుకున్న కార్మికుల శ్రమను బీఆర్ఎస్ ఎన్నడూ మరువదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Read Also : ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి!

పాలనా వైఫల్యాలు – ప్రమాద బాధితులకు అందని న్యాయం

రాష్ట్రంలోని కీలక శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకుని, సరైన పర్యవేక్షణ లేక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ (SLBC) సొరంగం పనుల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం చూపిన అసమర్థతను ఆయన ఎండగట్టారు. సిగాచి కంపెనీ ప్రమాద బాధితులకు నేటికీ న్యాయం జరగలేదని, ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మరోవైపు ‘హైడ్రా’ (HYDRA) పేరుతో పేద కార్మికులు కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేయడం అత్యంత దారుణమని, ఇది సామాన్యులను రోడ్డున పడేసే చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం దివాళా తీసిందని ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం వల్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు.

ధరల పెరుగుదల మరియు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు

కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచి చిన్న వ్యాపారుల, హోటల్ కార్మికుల నడ్డి విరిచిందని కేటీఆర్ విమర్శించారు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సుమారు 120 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడటం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది కూడా ఈ ప్రభుత్వ బాధితులుగా మారుతున్నారని ఆరోపిస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక పాలన సాగుతోందని దుయ్యబట్టారు. “రెండేళ్లు ఓపిక పట్టండి.. మళ్లీ కేసీఆర్ వస్తారు” అని కార్మికులకు భరోసా ఇస్తూ, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాతే కార్మిక వర్గానికి అసలైన న్యాయం జరుగుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

శ్రమ జీవులకు నిరంతర స్ఫూర్తి మేడే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha