Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకరైన పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ప్రపంచకప్ కల విషాదాంతమైంది.
ఫిఫా వరల్డ్‌కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 నాకౌట్ పోరులో బలమైన స్పెయిన్ చేతిలో పోర్చుగల్ 1-0 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు కెప్టెన్, 41 ఏళ్ల రొనాల్డో సుదీర్ఘ ఆరో ప్రపంచకప్ ప్రస్థానానికి అత్యంత బాధాకరమైన ముగింపు లభించింది. ఈ మెగా టోర్నీ మ్యాచ్‌కు ముందు రోజే రొనాల్డో తన అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఉనై సిమోన్ అడ్డుగోడ.. రొనాల్డో శ్రమ వృథా

తన కెరీర్‌లో ఆఖరి వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడుతున్న రొనాల్డో గోల్ సాధించడం కోసం మైదానంలో సర్వశక్తులూ ఒడ్డాడు. లభించిన కొన్ని అద్భుతమైన అవకాశాలను గోల్స్‌గా మలచడానికి ప్రయత్నించినప్పటికీ స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సిమోన్ (Unai Simon) పోర్చుగల్‌కు అడ్డుగోడలా నిలిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పోర్చుగల్ స్టార్ ఆటగాడు జోవావ్ ఫెలిక్స్ హెడర్ ద్వారా పంపిన బంతి సిమోన్ చేతికి తగిలి వెనక్కి రాగా, అక్కడే ఉన్న రొనాల్డో మెరుపు వేగంతో కిక్ కొట్టాడు. కానీ గాల్లోకి ఎగిరిన సిమోన్ తన రెండు చేతులతో ఆ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టి రొనాల్డో ఆశలపై నీళ్లు చల్లాడు. రొనాల్డో కొట్టిన ప్రతి షాట్‌ను నిలువరిస్తూ స్పెయిన్ డిఫెన్స్ విభాగాన్ని సిమోన్ ముందుండి నడిపించాడు.
స్పెయిన్ సరికొత్త చరిత్ర – 36 ఏళ్ల రికార్డు బద్దలు
ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ను ఓడించడమే కాకుండా, స్పెయిన్ జట్టు ప్రపంచకప్ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా (Clean Sheet) అత్యుత్తమ డిఫెన్స్ ప్రదర్శించిన తొలి జట్టుగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఇటలీ, స్విట్జర్లాండ్ పేరిట ఉండేది. స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సిమోన్ కూడా సరికొత్త వ్యక్తిగత మైలురాయిని అందుకున్నాడు. వరల్డ్‌కప్‌లో వరుసగా 609 నిమిషాల పాటు ఒక్క గోల్ కూడా కాకుండా నిలువరించిన గోల్‌కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా 1990 ప్రపంచకప్‌లో ఇటలీ దిగ్గజం వాల్టర్ జెంగా నెలకొల్పిన సుదీర్ఘ కాల రికార్డును సిమోన్ అధిగమించాడు.
Cristiano Ronaldo Retirement: ఎక్స్‌ట్రా టైమ్ డ్రామా.. మెరినో విన్నింగ్ గోల్
మ్యాచ్ ప్రారంభమైన మొదటి నిమిషం నుండే ఇరు జట్లూ వ్యూహాత్మకంగా తలపడ్డాయి. స్పెయిన్ జట్టు మిడ్‌ఫీల్డ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ 56 శాతం బాల్ పొసెషన్‌తో పోర్చుగల్ గోల్ పోస్ట్‌పై 15 సార్లు దాడులు చేసింది. అందులో 6 షాట్లు నేరుగా టార్గెట్‌ను తాకినా పోర్చుగల్ డిఫెన్స్ ప్రథమార్థంలో అడ్డుకుంది. సెకండ్ హాఫ్‌లో ఇరు జట్ల మేనేజర్లు పదునైన వ్యూహాత్మక మార్పులు చేశారు. పోర్చుగల్ కోచ్ జోవా కాన్సెలో, జోవా ఫెలిక్స్‌లను రంగంలోకి దించగా.. స్పెయిన్ కోచ్ 85వ నిమిషంలో డాని ఓల్మో స్థానంలో మికెల్ మెరినోను, రూయిజ్ స్థానంలో పెడ్రిని రంగంలోకి దించాడు.
నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు 0-0తో సమంగా ఉండటంతో రెఫరీ ఎక్స్‌ట్రా టైమ్ (Injury Time) ప్రకటించారు. ఈ క్రమంలో 90+1వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ అందించిన అద్భుతమైన పాస్‌ను సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మికెల్ మెరినో రెప్పపాటులో గోల్‌గా మలిచాడు. ఈ ఆకస్మిక గోల్‌ను అడ్డుకోవడంలో పోర్చుగల్ డిఫెన్స్ విఫలమవడంతో స్పెయిన్ 1-0తో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా.. రొనాల్డో సహా పోర్చుగల్ క్యాంప్ తీవ్ర నిరాశతో కన్నీటి వీడ్కోలు పలికింది.
Epaper: epaper.vaartha.com

