Dr Priyanka Medico: రాజమహేంద్రవరంలో దారుణమైన కారు ప్రమాదానికి గురై, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో తీవ్ర విషమ పరిస్థితుల్లో మృత్యువుతో పోరాడుతున్న మెడికో డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేశ్ తీవ్ర వేదనతో కంటతడి పెట్టారు.
తమ కుటుంబాన్ని నిలబెడుతుందని భావించిన కన్నకూతురు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో కారు నడిపి తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also :Dr Priyanka Medico KIMS: మెడికో ప్రియాంక కేసులో ఉత్కంఠ: నేడు కిమ్స్‌లో 'ఆప్నియా' పరీక్ష
Dr Priyanka Medico: ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఆవేదనలోని ప్రధాన అంశాలు
“మా అమ్మాయి బతకాలని వైద్యులతో కలిసి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఏ తండ్రికైనా కళ్లముందే బిడ్డ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉండటం చూస్తే మనసు ముక్కలవుతుంది. మా కుటుంబాన్ని ఈ పరిస్థితి తీవ్రంగా కలిచివేస్తోంది.” “సరదాగా వెళ్తున్న నా కుమార్తెకు ఇలాంటి గతి పట్టించిన ఆ తాగుబోతులని, బాధ్యులైన వారిని నడిరోడ్డుపై ఉరితీయాలి. అప్పుడే మరే తండ్రికి, కుటుంబానికి ఇలాంటి కడుపుకోత మిగలదు.” “చదువు పూర్తి చేసి, డాక్టర్‌గా మా కుటుంబానికి తనే పెద్ద దిక్కుగా ఉండి అన్నీ చూసుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది” అంటూ ప్రియాంక తండ్రి వెంకటేశ్ కంటతడి పెట్టుకున్నారు. మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి మెడికో ప్రియాంక జీవితాన్ని అంధకారం చేసిన నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, మెడికల్ కాలేజీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

