Mahabubnagar Road Safety Meeting: నగర ప్రజల క్షేమమే ముఖ్యం.. ప్రజా భద్రత ట్రాఫిక్ నిర్వహణలో సమగ్ర మార్పులు. స్పీడ్ గన్స్ వేగా నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలి.
ఆరు నెలల్లో 750 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
Read Also:Bandi Sanjay press meet: కొడుకు అరెస్ట్ పై బండి సంజయ్ స్పందన
రోడ్ సేఫ్టీ పై సమీక్ష మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో సమగ్ర మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్ఐసి కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత అధికారులతో నిర్వహించిన రోడ్ సేఫ్టీ సమీక్షా సమావేశంలో ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో పోలీస్, ట్రాఫిక్, మున్సిపల్, రోడ్డు రవాణా శాఖల అధికారులతో కలిసి పట్టణంలోని ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. పట్టణంలో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రజల భద్రత కోసం వచ్చే ఆరు నెలలలో మహబూబ్ నగర్ మొత్తం 750 వరకు సీసీ కెమెరాలతో కవర్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సీసీ కెమెరాలను ఎస్డీఎఫ్, ముడా, మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో సమన్వయంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నపిల్లలు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, మైనర్లు వాహనాలు నడపకుండా కఠినంగా నియంత్రించాలని పోలీస్ శాఖకు ఆదేశించారు.
Mahabubnagar Road Safety Meeting: తల్లిదండ్రులపై కూడా బాధ్యతను నిర్ధారించే చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరం చుట్టూ ఉన్న ప్రధాన హైవేలు, బైపాస్ రోడ్లలో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి వేగ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో అతివేగం వల్ల జరిగే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచడానికి రోడ్ సేఫ్టీ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో ఎస్పి, నగర మేయర్, డిప్యూటీ మేయర్, ముడా చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తదితరులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కమిటీ ప్రతి నెలా సమావేశమై రోడ్ సేఫ్టీ పరిస్థితులను సమీక్షించి, తక్షణ చర్యలు చేపడుతుందని తెలిపారు. వాహన యజమానులు, డ్రైవర్లలో బాధ్యత పెంపొందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియమాల పాటించాలని, తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణంలో సమయాన్ని మించి బార్ షాపులు, హోటల్స్ నడపరాదని స్పష్టంగా హెచ్చరించారు.
నియమావళి ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కోసం ఎస్పి డాక్యుమెంట్ సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న వారు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా అవగాహన కల్పిస్తూ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో, బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు సేవలందించడం తమ ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. "మహబూబ్ నగరాన్ని భద్రమైన, సురక్షితమైన పట్టణంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలు, అధికారులు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు సాధించగలం" అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహబూబ్ నగర్‌ను ఆక్సిడెంట్ ఫ్రీ జోన్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించుకున్నట్లు తెలిపారు. ఈ చర్యల ద్వారా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపడి, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గి ప్రజలకు మరింత భద్రత కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి జానకి, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, పోలీస్, మున్సిపల్, ట్రాఫిక్ మరియు రోడ్ రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

