విత్తనాలు కొనేముందు జాగ్రత్తలు పాటించాలంటున్న వ్యవసాయ శాఖ
Kharif season seeds: ఏటా మాదిరిగానే ఈ సారి కూడా రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ముంగిట విత్తన దందాకు అడ్డుకట్టపడటం లేదు.
తెలంగాణలో వాన కాలం సీజన్ సమీపించడంతో రైతన్నల కళ్లల్లో సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది రుతువవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో జూన్ మొదటివారంలో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వానాకాలం సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25 నుండి రోహిణి కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో పత్తి, వరి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయాన్ని కొండరు. కేటుగాళ్లు తమకు కానల కురిపించే సీజన్గా మార్చుకుంటున్నారు. అమాయక రైతుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాల మాఫియా కోట్లకు పడగలెత్తుతోంది. మొలకెత్తని విత్తనాలతో రైతన్నల జీవితాలను నడిరోడ్డుపై నిలబెడుతోంది. రాష్ట్రంలో విత్తన మాఫియా నెట్వర్క్ చాలా పకడ్బందీగా సాగుతోంది. బ్రాండెడ్ కంపెనీల పేర్లను పోలిన నకిలీ ప్యాకెట్లను తయారు చేయడం ఈ కేటుగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.
Police crackdown on fake seeds!
Kharif season seeds: పొరుగు రాష్ట్రాల సరిహద్దుల నుండి లూజ్ విత్తనాల తరలింపు
పొరుగు రాష్ట్రాల సరిహద్దుల గుండా, ఎలాంటి బిల్లులు లేకుండా లూజ్ విత్తనాలను తెచ్చి ఇక్కడి స్థానిక ఏజెంట్ల ద్వారా గ్రామాల్లోకి జొప్పిస్తున్నారు. తాము విక్రయిందే విత్తనాలు సాగు చేస్తే ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి గ్యారెంటీ అంటూ నమ్మబలికి అమాయక రైతులకు అంటగడుతున్నారు. ఈ ఏడాది వానా కాలం సాగు విస్తీర్ణం కోటి 30 లక్షల ఎకరాలుగా రాష్ట్ర వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాఫియా పంజా విసురుతోంది. పత్తి, మిర్చి, వరి విత్తనాలు పెద్ద మొత్తంలో పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని గ్రామాల్లో ఎరువుల దుకాణాలు నిర్వహించే వ్యాపారుల వద్ద నిల్వలు చేస్తున్నారు. రైతులకు ఆఫర్లు ఇస్తూ హాటికేళ్లా అమ్ముడుపోయేలా ఎత్తులు వేస్తున్నారు. ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, నారాయణపేట, సిరిసిల్ల, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో నకిలీ విత్తనాల విక్రయాలు సాగుతున్నట్టు అధికారులు గుర్తించారు. 12 ప్యాకెట్లు ఒక రైతు కొనుగోలు చేస్తే రెండు ప్యాకెట్లు ఉచితం, పక్క రైతులకు విక్రయాలు చేయిస్తే ప్యాకెట్ల ధరలో 10 శాతం కమీషన్ ఇస్తామని గుట్టుగా ప్రచారం చేస్తున్నారు. తొలకరి పడకముందే తమ వ్యాపారాన్ని ముగించి రూ.కోట్లు సంపాదించుకునేందుకు తంటాలు పడుతున్నారు. స్థానిక వ్యాపారులు తమ వద్ద ఎరువులు తీసుకునే రైతులకు అoట్టగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
నిషేధిత హెచ్లో (బీజీ-3) పత్తి విత్తనాల గుట్టుచప్పుడు కాని విక్రయాలు
ప్రతీ వానాకాలం సీజన్ లోలాగానే ఈ ఖరీఫ్ సీజన్లో పత్తి విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో విత్తనాలకు అమాంతం గిరాకీ పెరిగిపోయింది. పత్తి విత్తనాలు బలంగా ఉంటేనే రైతుకు పంట దిగుబడి అధికంగా వస్తుంది. అలాంటి విత్తనాలు కలుషితం చేయడంతోపాటు అసలైన వాటి స్థానాల్లో నిషేదిత, నకిలీ విత్తనాలను కేటుగాళ్లు అమ్ముతున్నారు. ఈ ఏడాది దాదాపు 50లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా, మార్కెట్లో పత్తిలో హెచ్లో (బీజీ-3) రకానికి దేశంలో అనుమతి లేదు. గడ్డి, పురుగు మందులను తట్టుకునే ఈ రకాన్ని సాగు చేయడంతో అధిక రసాయన మందులు చల్లి రైతులు రోగాల బారిన పడుతున్నారని గమనించి ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించింది. కానీ దిగుబడి ఎక్కువగా ఉంటుందని కొందరు గుట్టుగా ఈ రకం విత్తనాలను విక్రయిస్తున్నారు. ఏపి, మహారాష్ట్ర పొరుగు రాష్ట్రాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్రంలోకి నకిలీ విత్తనాలను తరలించి విక్రయిస్తున్నారు. మరికొందరు దళారులు నేరుగా విత్తనాలు విక్రయిస్తే పోలీసులకు దొరుకుతామని ఆన్లైన్లో విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఎకరానికి 2 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు కావాలి. 450 గ్రాములుండే ప్యాకెట్ను దాదాపు రూ.900కు విక్రయించాలని సర్కారు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఊరూపేరూ లేని కంపెనీలు, డీలర్లు, వ్యాపారులు ఏజెంట్ల సాయంతో గ్రామాల్లో తిరుగుతూ అధిక ధరలకు అవి నకిలి పత్తి విత్తనాలను అంటగట్టేందుకు సిద్ధమయ్యారన్న ఆందోళనను రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.
నకిలీలపై పోలీసు శాఖ ఉక్కుపాదం
వానాకాలం సాగు సమీపిస్తుండడంతో నకిలీ విత్తనాల విక్రయాలపై రాష్ట్ర పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్, వరంగల్ తోపాటు హైదరాబాద్ నగర శివార్లలో, మంచిర్యాలజిల్లాల్లో ఇటీవల పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే విత్తనాల దుకాణదారులు నేరుగా దుకాణాల్లో నకిలీల తంతు నడుపుతున్న క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయాధికారి, మండల విస్తరణాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, మామూళ్లు అందుతుండటంతో అటువైపు కనీసం కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాల బారినపడకుండా ఉండేందుకు గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ షాపులు లేదా ప్రభుత్వ డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనాలని, విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రశేదుపై విత్తనాల రకం, లాట్ నంబర్, గడువు తేదీ స్పష్టంగా ఉండాలని, సీల్ వేసిన ప్యాకెట్లను మాత్రమే తీసుకోవాలని, ప్యాకెట్పై క్యూఆర్ కోడ్ ఉంటే దానిని స్కాన్ వేసి నాణ్యతను దృవీకరించుకోవాలని గుర్తు చేస్తున్నారు. ప్యాకింగ్ లేని విడి విత్తనాలు తక్కువ ధరకే వస్తున్నాయని దళారుల వద్ద విత్తనాలను కొనుగోలు వేయొద్దని హెచ్చరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

