NEET JEE Exam Changes: దేశంలో వైద్య, ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ (NEET), జేఈఈ (JEE) వంటి ప్రవేశ పరీక్షల విధానంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది.
ఇకపై మెడికల్, ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో కేవలం ఎంట్రన్స్ పరీక్ష మార్కులను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా.. ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి బోర్డు పరీక్ష మార్కులకు కూడా 50 శాతం వెయిటేజీ (50% Weightage) కల్పించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏ ఒక్క పరీక్షపైనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఆధారపడకుండా, ఒత్తిడిని తగ్గించడమే ఈ సంస్కరణల వెనక ఉన్న ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.
Read Also: Patriotism : దేశభక్తితో జాతీయవాదాన్ని పోల్చడమా?
50% weightage for board exam marks in NEET and JEE admissions?
NEET JEE Exam Changes: పరీక్షా వ్యవస్థ విశ్వసనీయత పెంచేందుకు సంస్కరణలు
ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో జరిగిన పలు ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు, మూల్యాంకనంలో (Evaluation) చోటుచేసుకున్న సాంకేతిక లోపాలు వంటి దురదృష్టకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులలో పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపై తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రవేశ పరీక్షల సరళిని ప్రక్షాళన చేయాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వంద శాతం ఎంట్రన్స్ మార్కుల విధానానికి స్వస్తి పలికి, బోర్డు మార్కులను మెరిట్‌లో భాగం చేయడం ద్వారా పారదర్శకతను పెంచవచ్చని అధికారులు భావిస్తున్నారు.
కోచింగ్ సెంటర్లు, డమ్మీ స్కూళ్ల సంస్కృతికి చెక్!
ప్రస్తుతం ప్రవేశ పరీక్షల సిలబస్ విభిన్నంగా ఉండటంతో విద్యార్థులు కార్పొరేట్ కోచింగ్ సెంటర్లపై విపరీతంగా ఆధారపడుతున్నారు. దీనివల్ల డమ్మీ స్కూళ్ల సంస్కృతి దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ ధోరణిని అరికట్టేందుకు ప్రవేశ పరీక్షల ప్రశ్నలను రెగ్యులర్ స్కూల్ సిలబస్‌కు మరింత దగ్గరగా ఉండేలా రూపొందించాలని కేంద్రం నిశ్చయించింది. తద్వారా సామాన్య, మధ్యతరగతి విద్యార్థులకు కూడా కోచింగ్ సహాయం లేకుండానే సమాన అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
ఆన్-డిమాండ్ పరీక్షలు.. 9 మంది సభ్యుల కమిటీ కసరత్తు
భవిష్యత్తులో విద్యార్థులకు ఏడాది పొడవునా ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రవేశ పరీక్ష రాసే సువర్ణావకాశాన్ని కల్పించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ‘కంప్యూటర్ ఆధారిత అడాప్టివ్ ఆన్-డిమాండ్’ పరీక్షల వైపు అడుగులు వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కోచింగ్ సెంటర్ల ప్రభావం, డమ్మీ స్కూళ్ల పెరుగుదల మరియు ప్రవేశ పరీక్షలలో పూర్తి పారదర్శకతను తీసుకురావడం వంటి కీలక అంశాలపై లోతైన అధ్యయనం కోసం కేంద్ర విద్యాశాఖ గత ఏడాది ఒక తొమ్మిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిటీయే ఈ వినూత్న విద్యా సంస్కరణలను నిశితంగా పరిశీలిస్తూ, తుది నివేదికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే రానున్న విద్యాసంవత్సరం నుండి సరికొత్త అడ్మిషన్ల విధానం అమల్లోకి రానుంది.
Epaper: epaper.vaartha.com

