Pakistan Hindu Temple: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒక పురాతన హిందూ దేవాలయాన్ని కూల్చివేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
మదర్సా విస్తరణ కోసమే మత ఛాందసవాదులు ఈ ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని మానవ హక్కుల సంఘాలు, మైనారిటీ సంస్థలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి, ఆలయాన్ని తక్షణమే పునర్నిర్మించాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని మైనారిటీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also :Times Square Attack: న్యూయార్క్‌లో కలకలం.. టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో మహిళ దాడి!
Pakistan Hindu Temple: ఘటన నేపథ్యం & ప్రధాన ఆరోపణలు

పిటిఐ (PTI) వార్తా సంస్థ కథనం ప్రకారం లాహోర్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో ఆగస్టు 21న ఈ ఘటన చోటుచేసుకుంది. 125 ఏళ్ల నాటి ఈ ఆలయాన్ని నిషేధిత తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) పార్టీకి చెందిన వ్యక్తులు కూల్చివేశారని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆలయ భూమిని, దానికి ఆనుకుని ఉన్న మదర్సాలో కలిపేందుకే ఈ పని చేశారని మైనారిటీ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్థాన్ మసిహా మిల్లత్ పార్టీ (PMMP) ఛైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత్రా మాట్లాడుతూ.. దుండగులు ఆలయానికి చెందిన ఇటుకలు, శిఖరం లోహపు సామాగ్రిని కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. స్థానిక హిందూ నాయకుడు రతన్ లాల్ మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ మదర్సా నడుస్తుండటంతో, కూల్చివేసిన ప్రదేశానికి వెళ్లేందుకు కూడా స్థానిక హిందువులు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ETPB) అధికారి రాణా ఇఫ్తిఖార్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. భారీ వర్షాల కారణంగానే పాత నిర్మాణం కూలిపోయిందని, ఎవరూ కూల్చివేయలేదని తెలిపారు.

